- విపత్తు నిర్వహణ విభాగ సేవల విస్తరణకు సమగ్ర చర్యలు
- సిబ్బంది, అధికారుల నియామకం, నిధుల కేటాయింపుపై ముసాయిదా
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొనసాగుతున్న విపత్తుల నిర్వహణ విభాగ సేవలను అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ విభాగానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)గా పేరు మార్చేందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. హైదరాబాద్‌లో సోమవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెఎండీఏ, మూసీ డెవెలప్‌మెంట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగర భౌగోళిక పరిధి నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగ విభాగం పరిధినీ ఓఆర్‌ఆర్ వరకు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జీహెఎంసీతో పాటు పరిసర ప్రాంతాల్లోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలనూ విపత్తు నిర్వహణ విభాగంలోకి తీసుకురావాలన్నారు. ‘హైడ్రా’కు డీఐజీ స్థాయి అధికారిని ఈ విభాగానికి డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరైక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. అలాగే జీహెచ్‌ఎంసీ, హెఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను విభాగంలో భాగస్వాములు చేయాలన్నారు. ఇకపై జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, నాలాల పర్యవేక్షణ, హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగు నీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ‘హైడ్రా’ సేవలు అందించాలన్నారు.
హైడ్రా పరిధిలో విధులు నిర్వర్తించే సిబ్బంది విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చారిత్రక కట్టడాలు, శిథిల నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అధికారులు సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామిమా అబ్జర్వేటరీ, గుడిమల్కాపూర్ కోనేరు వంటి చారిత్రక ప్రదేశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్ ఏవీ రంగనాథ్, వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు..