* తొలిరోజు 83 దరఖాస్తులు
* మూడు వారాల్లో పరిష్కరిస్తామన్న కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): హైడ్రా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ప్రారంభించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం ఇదే తొలిరోజు కావడంతో ఫిర్యాదుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు.
ప్రజావాణికి విచ్చేసిన వారికి టోకెన్లు జారీచేసి మరీ ఫిర్యాదులు స్వీకరించగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు మొత్తం 83 ఫిర్యాదులు అందాయి. హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్ దాటి కూడా బాధితులు రావడంతో తమ పరిధి కాదం వెనక్కి పంపించారు.
ఇతర శాఖలకు చెందిన సమస్యలపై కూడా ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖాధిపతులకు అందజేయాలని సూచించారు. హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు కేటాయించి ఆయా సమస్యలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మూడు వారాల్లోగా ఫిర్యాదులపై స్పందన తెలియజేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఫిర్యాదులు అందజేసిన వారిలో సామాన్యుల నుంచి ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులు, ఆర్మీ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఉన్నారని హైడ్రా తెలిపింది.