calender_icon.png 27 September, 2024 | 3:18 AM

‘జయభేరి’కి హైడ్రా నోటీసులు

09-09-2024 01:30:55 AM

  1. నిర్మాణాల కూల్చివేతకు గడువు కోరిన సంస్థ 
  2. 15 రోజుల తర్వాత మరోసారి పరిశీలిస్తాం 
  3. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరిక

రంగారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్రిక్ట్ పరిధిలోని రంగలాల్‌కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ను అక్రమించి సినీ నటుడు మురళీమోహనక్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని గుర్తించిన హైడ్రా.. ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రెండురోజుల క్రితం రంగలాల్, భగీరథమ్మ చెరువు, కుంటలను హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ తన బృందంతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలించారు.

నియోజకవర్గం పరిధిలోని ప్రజల నుంచి వెల్లువెత్తున్న ఫిర్యాదులకు స్పందించిన ఆయన.. ఆయా చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. రికార్డుల ప్రకారం చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఆక్రమణల అనంతరం ఉన్న విస్తీర్ణంపై సర్వే చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వారి జాబితాను రూపొందించండంతోపాటు అక్కడ నిర్మాణాల కోసం అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారుల జాబితానూ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, 15 రోజుల తరువాత మళ్లీ అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో నిర్మాణాలు అలాగే ఉంటే బుల్డోజర్లు వస్తాయని అక్రమార్కులను హెచ్చరించారు.  

నోటీసులు ఇచ్చాం : ఏవీ రంగనాథ్ 

నానక్‌రామ్‌గూడ రంగలాల్ చెరువులో సినీ నటుడు మురళీమోహన్‌కు చెందిన నిర్మాణ సంస్థ జయభేరికి నోటీసులు జారీచేసిన మాట వాస్తవమేనని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించామని చెప్పారు. వారం రోజుల్లో ఎఫ్టీఎల్‌లో నిర్మాణాలను తొలగించేందుకు జయభేరి సంస్థ గడువు కోరిందని, అక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్చివేత ప్రారంభిస్తుందని రంగనాథ్ స్పష్టంచేశారు. 

మేమే కూల్చివేస్తాం..: మురళీ మోహన్, జయభేరి అధినేత 

హైడ్రా అధికారుల నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్‌ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేటపట్టినట్టు వెల్లడించారు. రంగలాల్ చెరువు బఫర్ జోన్‌లో మూడు అడుగుల విస్తీర్ణంలో రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించామని హైడ్రా అధికారులు చెప్పారని, వాటి కూల్చివేతకు హైడ్రా బృందం రావాల్సిన అవసరం లేదని, ఆ షెడ్డును తామే కూల్చివేస్తామని స్పష్టంచేశారు.