calender_icon.png 3 February, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాను ఎత్తివేయాల్సిందే

03-02-2025 01:06:35 AM

  1. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ కుదేలు 
  2. అప్పులపాలై బిల్డర్ల ఆత్మహత్యలు
  3. బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డిది పరోక్షంగా ప్రభుత్వ హత్యే
  4. మాజీమంత్రి హరీశ్‌రావు  
  5. మృతుడి కుటుంబానికి పరామర్శ

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ 13 నెలల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీష్‌రావు ఆరోపించారు. హైడ్రా భయం తో అపార్ట్‌మెంట్లు అమ్ముడుపోక..బ్యాంకర్లు లోన్లు ఇవ్వక బిల్డర్లు  నష్టాలపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

హైడ్రాను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం హరీశ్‌రావు, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఇతర నాయకులు పరామర్శించారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రియల్ ఎస్టేట్‌లో నష్టాల వల్లే వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ..వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఓ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. మృతుడి భార్య చెప్పిన వివరాల మేరకు ఏ బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం ప్రయత్నించినా బ్యాంకర్లు “నీవు బిల్డర్‌వు.. 

నీకు లోను ఇవ్వం.. ”అని చెప్పారని, దీంతో భార్య పేరు మీద లోన్ కోసం ప్రయత్నించినప్పటికీ కో అప్లికెంట్‌గా భర్త బిల్డర్ కావడంతో లోన్ ఇవ్వమని బ్యాంకర్లు చెప్పారని హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కట్టిన అపార్ట్‌మెంట్ అమ్ముడుపోక..వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు. 

కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేతలు, ఆటో కార్మికులు, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కొనసాగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో వృద్ధి చెందిందని, రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాన ని చెప్పుకునే రేవంత్‌రెడ్డి బేషజాలకు పోకుం డా హైడ్రా వంటి సంస్థలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 

వేణుగోపాల్‌రెడ్డి కట్టిన నిర్మాణాలు హైడ్రా పరిధిలో లేకపోయిన భయంతో విక్రయాలు జరుగలేదన్నారు. హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతల నేపథ్యంలో నెలకొన్న ప్రతికూల ప్రచారంతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని.. బిల్డర్లు నష్టపోయి వలస పోతున్నారన్నారు.

వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, జనతా గ్యారేజీగా పిలువబడే బీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి తమ కష్టాలు చెబితే పార్టీ అవసరమైన సహాయం అందిస్తుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.