29-03-2025 02:25:00 AM
గత త్రైమాసికంలో 49శాతం తగ్గిన విక్రయాలు
పెద్దల ఆస్తులతో కాంగ్రెస్ పాలకుల సెటిల్‌మెంట్లు
తెలంగాణకు బీవైడీ సంస్థ బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఫలితమే
‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): హైడ్రా, మూసీప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో ఇండ్ల కొనుగోళ్లు తగ్గడంతో రియల్టర్లు ఆందోళనలో ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహ త్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కూల్చడం కాదు కట్టడం నేర్చుకోవాలని, అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయ డం నేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’గా ఉన్న హైదరాబా ద్..15నెలల కాంగ్రెస్ అసమర్థ పాలనలో అ‘భాగ్యనగరం’గా మారిందని ఎద్దేవా చేశారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు గత త్రైమాసికంలో 49 శాతం తగ్గాయన్నారు. ఆఫీస్ లీజింగ్ కూడా అథఃపాతాళానికి పోయిందని, 2025 జనవరి మధ్య 41 శాతం తగ్గుదల నమోదైందన్నారు. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు.. పెద్దల ఆస్తులతో సెటిల్‌మెంట్లతో.. ‘రియల్’ ఢమాల్ అందని, ఇన్ఫ్రా సజీవ సమాధి అయ్యిందని ఆరోపించారు.
విధ్వంసాన్ని ఆపాలి..
గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ బుద్ధిహీన నిర్ణయంతో నగరానికి ఊపిరినిచ్చే స్థలాన్ని కోల్పోనుందని కేటీఆర్ ఎక్స్‌లో మరో ట్వీట్ చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ఆ భూమిలో జంతువులు లేవని తప్పుడు ప్రకటన చేశారని తెలిపారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకుల ప్రకారం 700 కంటే ఎక్కువ జాతు లు పుష్పించే మొక్కలు, పది రకాల క్షీరదా లు, 15 రకాల సరీసృపాలు, 200 కంటే ఎక్కువ జాతుల పక్షులకు నిలయంగా ఉందన్నారు. బిలియన్ ఏండ్ల నాటి రాతి నిర్మా ణాలకు నిలయంగా ఉందని పేర్కొన్నారు.
కేటీఆర్‌కు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం
బ్రిటన్‌లో జరిగే ‘ఐడియాస్ ఫర్ ఇండి యా’ సదస్సుకు రావాలంటూ బ్రిడ్జ్ ఇండి యా సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. మే 30న లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే ఈ సదస్సుకు కేటీఆర్‌ను ముఖ్యవక్తగా పిలుస్తూ, బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీ ఆహ్వాన లేఖ పంపారు.
2023లో ఇదే కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న కేటీఆర్ ప్రసంగం, ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయని ప్రతీక్ తెలిపారు. ఈసారి కూడా లండన్ వ్యాపార వర్గాలు, ఇండో కారిడార్‌లోని ముఖ్యవ్యక్తులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్‌ను కలవడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి అమితమైన ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ సదస్సుకు భారత్-, బ్రిటన్ వ్యాపార రంగ ప్రముఖులు, పాలసీ మేకర్లు, తెలుగు ప్రవాసులు సహా 900 మందికిపైగా హాజరవుతార న్నారు.
తెలంగాణకు బీవైడీ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఫలితమే
రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడులతో రావడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెం ట్ కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు.2023లోనే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయన్నారు. బీవైడీ కంపెనీ రాష్ట్రానికి రావడం ఫార్ములా- ఈ రేసు ప్రత్యక్ష ఫలితమని వెల్లడించారు. బీవైడీ రాకకు ఏండ్ల తరబడి కష్టపడిన అందరికీ ఎక్స్ వేదికగా కేటీఆర్ అభినందనలు తెలిపారు.