calender_icon.png 1 October, 2024 | 2:54 PM

చెరువుల పునరుద్ధరణే హైడ్రా లక్ష్యం

01-10-2024 02:18:30 AM

కూల్చివేతలు అన్నీ హైడ్రావి కావు 

మా పరిధి ఓఆర్‌ఆర్ వరకే 

మూసీ పనులతో హైడ్రాకు సంబంధం లేదు 

ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మొద్దు: హైడ్రా కమిషనర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని చెరువులను పునరుద్ధరించి, వరద నీటిని ఎక్కడికక్కడ చెరువుల్లోకి చేరేలా చేయడంతో పాటు నగరంలోని కాలువలు, నాలాలు ఆక్రమణలు లేకుండా వరద నీరు సాఫీగా పారేందుకు చర్యలు తీసుకోవడమే హైడ్రా లక్ష్యం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

నగరంలోనే కాదు.. రాష్ట్రం లో, ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు జరిగినా హైడ్రాకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్యాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమీన్ పూర్ బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం హైకోర్టుకు వర్చువల్‌గా హజరయ్యారు.

ఈ సందర్భం గా గ్రేటర్ హైదరాబాద్‌లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఎక్స్ వేదికలో పలు అంశాలను ప్రస్తావిస్తూ పోస్టు చేశారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మాత్రమేనని స్పష్టం చేశారు.

నగరంలో చెరువుల పునరుద్దరణకు రెవెన్యూ, ఇరిగేషన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్, స్టేట్ రిమోట్ సెన్సింగ్ విభా గాలతో అధ్యయనం చేయించి చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్దారణ చేయనున్నట్టు చెప్పారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని ప్రజలు, సామాజిక మాధ్యమాలు గుర్తించాలన్నారు.

పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని స్పష్టంచేశారు. మూసీ నది కి ఇరువైపులా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేల తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నగరంలో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనదారులు సాఫీగా ప్రయాణం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరిస్తూ (డిజిస్టార్ రెస్క్యూ మేనేజ్‌మెంట్ ఫోర్స్) డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించి ప్రజలను కాపాడటం, చెట్లు కూలితే వెంటనే తొలగించడం, రహదారులు, నివాసాల్లోకి చేరిన వరద నీటిని మళ్లించడం, వరద ముప్పు లేకుండా వరద నీటి కాలువలు సాఫిగా పారేలా హైడ్రా చర్యలు చేపడుతుందన్నారు.