calender_icon.png 26 November, 2024 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేట్లబుర్జు ప్రాంతంలో పలు ఇండ్లకు హైడ్రా మార్కింగ్

11-10-2024 02:15:57 AM

కూల్చకుండా స్టే ఇవ్వాలంటూ హౌస్‌మోషన్ పిటిషన్

దసరా సెలవుల తర్వాత విచారించనున్న హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పేట్లబుర్జు ప్రాంతంలో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేపట్టి ఇండ్లకు మార్కింగ్ వేయడంతో ఆ ప్రాంతానికి చెందిన మహేందర్ సింగ్ దాస్‌తో పాటు మరో 14 మంది గురువారం అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

హైడ్రా, మున్సిపల్, రెవెన్యూ అధికారులు తమ ప్రాంతంలోని ఇళ్లను కూల్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దసరా సెలవుల నేపథ్యంలో గురువారం అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 14న కోర్టు పునఃప్రారంభమైన తర్వాత పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది.

నిజాం ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో నిర్మించుకున్న గురుద్వార్, హనుమాన్ ఆలయాలతో పాటు తమ ఇళ్లను కూల్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. పేట్లబుర్జు ప్రాంతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో పిటిషనర్లకు ఇండ్లు ఉన్నాయి. మూసీ నది ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో ఆ భూమి ఉందని అధికారులు మార్కింగ్ చేశారు.

వాస్తవానికి మూసీ నది బఫర్ జోన్ పరిధికి వెలుపల పిటిషనర్ల ఇండ్లు ఉన్నాయి. మూసీ ప్రవాహ ప్రాంతం చుట్టూ నిజాం కాలంలోనే నిర్మించిన సరిహద్దు గోడకు వెలుపల ఉన్నాయి. మహేందర్ సింగ్ ఈ ప్రాంతంలోని గురుద్వార్, హనుమాన్ ఆలయానికి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. గత 80 సంవత్సరాలుగా వారంతా అక్కడే నివసిస్తున్నారు. విద్యుత్, తాగునీరు ఇతర సౌకర్యాలకు బిల్లులు చెల్లిస్తున్నారు.