calender_icon.png 8 November, 2024 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్తిగూడకు హైడ్రా ఊరట

31-08-2024 03:53:43 AM

  1. కబ్జా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ 
  2. కాలువల పునరుద్ధరణకు ఆదేశాలు 
  3. కదిలిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు 
  4. చెరువులోకి వరద కాల్వ పునరుద్ధరణ

ఎల్బీనగర్, ఆగస్టు 30: హయత్‌నగర్ రెవెన్యూ పరిధిలోని 98, 99 సర్వే నెంబర్లలో 8 ఎకరాల విస్తీర్ణంలో హత్తిగూడ చెరువు ఉన్నది. మన్సూరాబాద్, హయత్‌నగర్ డివిజన్ల పరిధిలో ఈ చెరువు ఉన్నది. అయితే ఎఫ్‌టీఎల్ భూముల్లో కాలనీలు వెలియడంతో చెరువు విస్తీర్ణం ఇప్పుడు కేవలం రెండు ఎకరాలకే పరిమితమైంది. స్థానిక కార్పొరేటర్, స్థానికులు చెరువును కాపాడాలని  హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 1న ఈవీడీఎం విజిలెన్స్ ఏఈ మల్లికార్జున్, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి చెరువును పరిశీలించి, హైడ్రాకు నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగస్టు 13న హత్తిగూడ చెరువును పరిశీలించారు.

చెరువు పూడ్చివేత, వరద కాలువ ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ముందుగా చెరువులోకి వరద కాల్వను పునరుద్ధరించాలని ఆదేశించారు. పూర్తి రికార్డులు పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు స్పందిం చి వరద కాల్వను పునరుద్ధరించారు. కాల్వ పునరుద్ధరణతో చెరువలోకి వరద వెళ్లడానికి మార్గం ఏర్పడింది. ఇంతకు ముందు కాల్వ లేకపోవడంతో ఎగువ ప్రాం తాల నుంచి వచ్చే వరద నీరు ఇండ్లలోకి చేరేది. కాలువ పునరుద్ధరణతో కొద్దిగానైనా వరద చెరువులోకి వెళ్లే మార్గం ఏర్పడింది. 

అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువు కబ్జా!

హత్తిగూడ చెరువు పరిధి చిన్నది కావడంతో అధికారులు పట్టించుకోలేదు. మొదటగా హయత్‌నగర్ రెవెన్యూ పరిధిలో చెరువు ఉండేది. హయత్‌నగర్ మండల కేంద్రం జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో జీహెచ్‌ఎంసీ, మండల కార్యాలయాల మధ్యన సమన్వయం లోపించింది. ఫలితంగా హత్తిగూడ చెరువుపై పరిరక్షణ కొరవ డింది. దీంతో అక్రమార్కులు చెరువును పూడ్చి ఇళ్లను నిర్మించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పూర్తిగా పరిశీలించకుండానే లే అవుట్లు, ఇండ్ల  నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. హత్తిగూడ చెరువు భూములపై రీ సర్వే చేసి, ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు హైడ్రాను కోరుతున్నారు. 

అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోనే హత్తిగూడ చెరువు కబ్జాకు గురైంది. దీంతో వరద ముంపు సమస్య వస్తున్నది. అధికారులు సమన్వయంతో చెరువు భూమిపై రీ నిర్వహించాలి. మన్సూరాబాద్ డివిజన్‌లోని చెరువులను కాపాడి, భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించాలి.

 కొప్పుల నర్సింహరెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్

గతంలో గణపతి విగ్రహాల నిమజ్జనం చేశాం

హత్తిగూడ చెరువులో గతంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశాం. బతుకమ్మలను కూడా నిమజ్జనం చేసేవారు. అక్రమార్కులు చెరువును పూడ్చి వేయడంతో ఇళ్లలోకి నీళ్లు వచ్చేవి. హైడ్రా అధికారులు వరద కాల్వను పునరుద్ధరించడంతో కొంతమేరకు సమస్య తీరనుంది.

 పారంద సాయి, మన్సూరాబాద్