calender_icon.png 7 November, 2024 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహజ వనరుల పునరుద్ధరణకే హైడ్రా

31-08-2024 12:43:33 AM

  1. నాలాలు, చెరువుల ఆక్రమణతోనే ముంపు 
  2. కార్బన్ రహిత నగరంగా ఫ్యూచర్ సిటీ 
  3. మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): సహజ వనరుల పునరుద్ధరణ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నదులు, చెరువులు, వాగులు, అడవులన్నీ మానవాళి మనుగడకు అవసరమైనవేనని అన్నారు.  ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోకపోతే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘గృహ’ పర్యావరణ సంస్థ నిర్వహించిన సదస్సుకు హాజరై మాట్లాడారు.

మనం సాధించిన అభివృద్ధితో జీవావరుణానికి అపార నష్టం జరుగుతోందని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయని తెలిపారు. వేగంగా జరుగుతున్న పర్యావరణ మార్పులను నియంత్రించేందుకు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వపరంగా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచించారు. చెరువులు, వర్షపు నీటి నాలాలు, నదులను కాపాడేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ‘హైడ్రా’ విభాగాన్ని ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్ల వరద నీటి ముంపు సమస్య తలెత్తుతోందని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య మరింత త్రీవ రూపం దాల్చి పరిస్థితి చేయిదాటి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ అత్యాధునిక టెక్నాలజీతో కార్బన్ రహిత నగరంగా రూపొందుతుందని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించాల్సిందిగా మహీంద్రా యూనివర్సిటీని కోరామని, గృహ సంస్థ కూడా చేతుల కలిపి పర్యావరణ హిత నగరానికి దోహదపడాలని కోరారు.

ఇదంతా కొత్త ఉద్యోగాల సృష్టికి, స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. నవోదయ విద్యా సమితి సంస్థలు రూపొందించిన ‘సస్టెయినబుల్ ఇనిషియేటివ్స్’ అనే సంకలనాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ అవసరాలకు తగిన స్థాయిలో పునరుత్పాదక ఇందనాన్ని సోలార్ ఎనర్జీ రూపంలో తయారు చేసుకుంటుంన్నామని తెలిపారు. కార్యక్రమంలో గృహ సంస్థ ప్రతినిధులు సంజయ్ సేథ్, షబనా బస్సీ తదితరులు పాల్గొన్నారు.