calender_icon.png 21 September, 2024 | 6:12 AM

హైదరాబాద్ రక్షణకే హైడ్రా

21-09-2024 02:59:50 AM

  1. ఈ సంస్థకు కులం లేదు, మతం లేదు
  2. నగరం పై భాగంలో నాడు ౭౮౮ చెరువులు
  3. అవి ధ్వంసం కావటంవల్లే వరదలు
  4. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో విపత్తుల నివారణకు ఏర్పాటుచేసిన హైడ్రాకు పార్టీలు, కులాలు లేవని.. అందరినీ ఒకే దృష్టితో చూస్తుందని ఆర్ అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు 1908లో వచ్చినట్లుగా మరోసారి వరద ముప్పు రాకుండా కాపాడేందుకే ఈ సంస్థ పనిచేస్తున్నదని చెప్పారు. సెప్టెంబర్ ౧౫వ తేదీన ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని దేశంమొత్తం ఇంజినీర్స్ డేగా నిర్వహించుకొంటున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ భవన్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నిర్వహించిన  నిర్వహించిన ఇంజినీర్స్ డే కార్యక్రమానికి నీటపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ౧౯౦౮లో హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చిన తర్వాత నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి ఆహ్వానించి వరద నియంత్రణ, మురుగునీటి పారుదల ఏర్పాటు గురించి సలహా అడిగారని తెలిపారు.

హైదరాబాద్ భౌగోళిక స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసిన విశ్వేశ్వరయ్య.. నగరం పైభాగంలో ఉన్న 788 చెరువులకు గాను వరదల కారణంగా 221 చెరువులు ధ్వంసమయ్యాయని గుర్తించారని, ఈ వరదను తట్టుకోవాలంటే నగరానికి పైభాగంలో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలని సూచించినట్టు చెప్పారు. దీంతో మూసీకి ఉపనది అయిన ఈసీ నదిపై ఇప్పుడున్న హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ను నిజాం నిర్మించాడని వెల్లడించారు.

788 చెరువులతో ఉన్న హైదరాబాద్ పైభాగంలో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నయో మనమంతా ఒకసారి ఆలోచించాలని సూచించారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి మళ్లీ 1908 నాటి వరదలను పునరావృతం కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నదని వివరించారు.  అన్ని రాజకీయ పార్టీలు హైడ్రాకు మద్దతిచ్చి విశ్వేశ్వరయ్యకు  ఘన నివాళులు అర్పించాలని ఆయన కోరారు.