calender_icon.png 30 September, 2024 | 4:55 AM

‘హస్తం’లో హైడ్రా అలజడి

30-09-2024 02:51:34 AM

  1. ఇండ్ల కూల్చివేతలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు 
  2. పేదల జోలికి వెళ్లడం నష్టమేనంటున్న నాయకులు 
  3. ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లయిందనే విమర్శ 

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పుడు అధికార పార్టీలో చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నది. పేదల ఇండ్లను హైడ్రా కూల్చివేస్తుండటంపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చెరువుల అక్రమణ, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో  ధనవంతులు నిర్మించిన ఇళ్ల విషయంలో హైడ్రా దూకుడుపై మొదట సానుకూలత వ్యక్తమైనా.. పేదల ఇళ్ల జోలికి వచ్చేసరికి కాంగ్రెస్ నాయకుల్లో అలజడి కనిపిస్తోంది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకున్నప్పటికి..

పేదల ఇళ్లను తొలగించాలనే నిర్ణయం పై చాలామంది నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం ఇచ్చామని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్ పార్టీ పేద ప్రజలను ముందుపెట్టి.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పోరాటాలు చేస్తున్నదని, ఇది పార్టీకి భవిష్యత్‌లో ప్రతికూలంగా మారుతుందని ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. 

‘హైదరాబాద్ నగరంలో ఒక పేద కుటుం బం కనీసం 50 గజాల స్థలంలో  ఒక ఇంటి ని నిర్మించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. కూలినాలి చేసి పైసా పైసా కూడబెట్టుకోవడం, లేదంటే అప్పోసప్పో చేసి ఇంటి స్థలం కొనుగోలు చేసి.. రేకుల ఇళ్లు లేదంటే స్లాబ్‌తో ఇంటి నిర్మాణం చేసుకుంటారు.

ఇప్పుడు వారి ఇంటిని కూల్చి, నగరానికి దూరంగా డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ ఇస్తామంటే ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారా?’ అని నేతలు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా ధనవంతుల నుంచి పేద ప్రజల వైపు మళ్లిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాంటు పంచాయ తీ ఎన్నికలపైనా దీని ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా హైడ్రా, మూసీ ప్రక్షాళన విషయంలో సర్కార్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికా ర పక్షం నుంచి దీటుగా సమాధాలివ్వటంలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమువుతోంది. 

వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మూసీ ప్రక్షాళన ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. మూసీ వెంట ఉన్న ఇళ్లకు ముందుగా రెడ్ మార్క్ వేయడం కం టే.. వారికి నచ్చచెప్పి, ప్రత్యామ్నాయ మార్గం చూపించి ఉంటే బాగుండేదని అంటున్నారు.