calender_icon.png 4 January, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్క్ స్థలంలో కబ్జాను తొలగించిన హైడ్రా

04-12-2024 01:11:10 AM

అల్మాస్‌గూడలో ఆక్రమణలను అడ్డుకున్న అధికారులు

మహేశ్వరం, డిసెంబర్ 3: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని కబ్జాదారుడి చెరనుంచి హైడ్రా అధికారులు కాపాడారు. అల్మాస్‌గూడ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో సర్వే నంబర్ 89, 90లలో 1982లో 11ఎకరాల 27గుంటల స్థలంలో ఏనుగు జంగారెడ్డి అనే వ్యక్తి వెంచర్ చేశాడు.

ఈ వెంచర్‌లో భాగంగా వాస్తు ప్రకారం లేని క్రాస్‌బిట్ 1,100 గజాల స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని 2019లో అప్పటి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు జంగయ్య బృందం బడంగ్‌పేట్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన కృష్ణ మోహన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించడంతో పార్కు స్థలంగా గుర్తిస్తూ కమిషనర్ అప్పట్లో సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.

తదనంతరం వెంచర్ చేసిన నిర్వాహకుడు ఏనుగు జంగారెడ్డి మనవళ్లు ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి, ఏనుగు సురేందర్‌రెడ్డి పలుమార్లు సంబంధిత స్థలం తమదంటూ సూచికబోర్డులను తొలగించారు. తాజాగా పార్కు స్థలంలో రాత్రికి రాత్రి తాత్కాలికంగా కంటైనర్‌ను ఏర్పాటు చేశారు.

ఈ విషయమై కాలనీవాసుల ఫిర్యాదు మేరకు మంగళవారం హైడ్రా ఇన్‌స్పెక్టర్ తిరుమల్లేశ్ ఆధ్వర్యంలో.. మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు జేసీబీలతో పార్కుల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన కంటైనర్‌ను ధ్వంసం చేశారు. అక్రమార్కుల చెర నుంచి పార్కుస్థలాన్ని కాపాడడంతో కాలనీవాసులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.