07-02-2025 01:04:21 PM
రంగారెడ్డి,(విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజక వర్గంలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో శుక్రవారం హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్, అక్రమ హోర్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలకు దిగింది. అలాగే శంషాబాద్‌లోని సిద్ధాంతి జాతీయ రహదారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రాంతంలోని హోర్డింగ్‌లను తొలగించడానికి హైడ్రా సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి పరిశీలన జరుపుతోంది.
మరికొద్ది సేపట్లో కూల్చివేతల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. రెండు రోజుల క్రితం శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్లు 601, 602 లో చేపట్టిన ప్రహరీ గోడను కూల్చివేశారు. వివాదాస్పద రోడ్డు స్థలం విషయంలో ఫిర్యాదులు రావడంతో కూల్చివేశారు. అయితే తమ పట్టా భూమిలో తాము నిర్మించుకున్న ప్రహరీ గోడను హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసారని బాధితులు మండిపడుతున్నారు.