- వెంచర్ లో వెయ్యి గజాల పార్కు స్థలం కబ్జా... ఆపై నిర్మాణం
- ఊటుపల్లిలో రోడ్డును ఆక్రమించిన ఘనులు
- నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు
- చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 3: హైడ్రా శంషాబాద్ లో కొరడా ఝలిపింది. సోమవారం అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్( సదరన్ పారడైజ్ వెంచర్ )లో ఓ వెంచర్ లోని పార్కు కు సంబంధించిన వెయ్యి గజాలను కొందరు అక్రమార్కులు ఆక్రమించారు. అంతేకాకుండా అందులో దర్జాగా ఫెన్సింగ్ వేసి నిర్మాణంతో పాటు బాత్ రూమ్ తదితరాలు నిర్మించుకున్నారు.
ఈ విషయమై హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు దానిని నేలమట్టం చేశారు. అదేవిధంగా ఊటుపల్లిలో కొందరు కేటుగాళ్ళు రోడ్డును ఆక్రమించారు. 33 ఫీట్ల రహదారిలో సుమారు 19 ఫీట్లు ఆక్రమించి(500 గజాలు) అందులో రెండు నిర్మాణాలు చేపట్టారు. హైడ్రా అధికారులు వాటిపై కూడా కొరడా జులిపించి పూర్తిగా నేలమట్టం చేశారు. చెరువులతో పాటు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా అధికారులు హెచ్చరించారు.