28-03-2025 01:22:56 AM
పార్కు స్థలంతో పాటు రోడ్లకు విముక్తి
కూల్చివేతల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత
హైడ్రా సీఐ తిరుమల్లేశ్‌పై దాడికి యత్నం
మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు
మహేశ్వరం, మార్చి 27 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్‌గూడలో హైడ్రా అధికారులు పంజా విసిరారు. అక్రమంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంతో పాటు రోడ్లను కబ్జా చేసి వేసిన ఫెన్సింగ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారు. మా వ్యవసాయ భూమిలో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు మీకేం అధికారం ఉందని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ బోయపల్లి శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బోయపల్లి వెంకట్‌రెడ్డి అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో జేసీబీకి అడ్డంగా బైఠాయించారు. వారిని పక్కకు తీసుకొచ్చే క్రమంలో హైడ్రా సిబ్బందితో బోయపల్లి శేఖర్‌రెడ్డి గొడవకు దిగాడు. ఇదే సమయంలో హైడ్రా ఇన్‌స్పెక్టర్ తిరుమల్లేశ్‌పై శేఖర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యాలు చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో సీఐ తిరుమల్లేశ్‌ను తోసివేశాడు.
వెంటనే హైడ్రా సిబ్బంది గొడవకు దిగిన వారిని పక్కకు లాక్కెళ్లారు. ఆ తర్వాత పార్కుతో పాటు రోడ్ల కబ్జాను తొలగించి ప్రభుత్వ భూమిగా హైడ్రా అధికారు లు సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అయితే ఒక రోజు ముందుగానే హైడ్రా కూల్చివేతలు చేపడుతుందని మీర్‌పేట్ పోలీసులకు సమాచారం అందించినా కూల్చివేతల సమయంలో పోలీసులు రాకపోవడంతో హైడ్రా అధికారులు సీరియస్ అయ్యారు. మీర్‌పేట్ పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు: రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: ప్రభుత్వ భూ ములు కబ్జాకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున వాటి పరిరక్షణకు హైడ్రా యంత్రాంగం కదిలింది. గురువారం పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేట, ఫిలింనగర్ బస్తీ విష్పర్ వ్యాలీకి చేరు వగా ఉన్న చెరువు, శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామం, కుత్భుల్లాపూర్ మండలంలోని గా జుల రామారం గ్రామంలో ప్రభుత్వ భూ ములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్లకు ఆటంకం లేకుం డా చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రహరీలను నిర్మించి కాపాడుతామన్నారు. ప్రభుత్వ భూములను త్వరగా సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.