శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): సంవత్సరాంతం చివరి రోజు అయిన డిసెంబర్ 31వ తేదీన అందరూ న్యూ ఇయర్ ఈవెంట్లకు సిద్ధమవుతున్న వేళ హైడ్రా ఒక్కసారిగా కొరడా జూలిపించింది. ఖాజాగూడ భాగీరథమ్మ చెరువు(Khajaguda Bhagirathamma Cheruvu) బఫర్ జోన్‌లో వెలసిన ఆక్రమణలను మంగళవారం ఉదయం నుండి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించి కబ్జా చేరల్లోంచి చెరువుకు విముక్తి కల్పించారు. పదుల సంఖ్యలో వెలసిన అక్రమ సముదాయాలను హైడ్రా(Hydra ) సిబ్బంది నెలమట్టం చేశారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే తమ వ్యాపార సముదాయాలను ఎలా కుర్చీ వేస్తారంటూ బాధితులు హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగింపు కొనసాగింది. ఈ నేపథ్యంలో కూల్చివేతలు చేపడుతున్న భాగీరథమ్మ చెరువు(Bhagirathamma Cheruvu) వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలా కాలంగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ హైడ్రా ఆధికారులను నిలదీశారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను నడిరోడ్డుపై పడేసారంటూ ఆవేధన చెందారు. నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి వ్యాపారాలు దుకాణాలను ఖాళీ చేయలేదు. దీంతో హైడ్రా అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు.