calender_icon.png 20 April, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన

14-03-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలను సందర్శించారు. అల్వాల్ మండలం తిరుమలగిరి లోతుకుంటలో ప్రభుత్వభూమి కబ్జాను పరిశీలించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ఈ భూమి జనరల్ ల్యాండ్ రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదిగా నమోదవ్వగా, ప్రైవేటు వ్యక్తులు తమదని పేర్కొంటున్నట్లు గుర్తించారు.

వందెకరాలకు పైగా ఉన్న ఈ భూమిలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. అనంతరం గండిమైసమ్మ మండలం దుండిగల్‌లోని బుబ్బఖాన్ చెరువు దిగువన ఉన్న లింగం చెరువు కాల్వ పరిసరాలను కమిషనర్ పరిశీలించారు.

బుబ్బఖాన్ చెరువు అలుగు, తూము నుంచి వరద నీరు బయటకు వెళ్లకుండా నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని, దీంతో వరద ముంచెత్తుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నాలా సమస్యను పరిష్కరించాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో అంతా కలిసికట్టుగా నిర్ణయానికి రావాలని స్థానికులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు సూచించారు. తర్వాత హఫీజ్‌పేట దగ్గర ప్రభుత్వ భూమి కబ్జాను పరిశీలించారు.