calender_icon.png 27 November, 2024 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈదులకుంట చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

27-11-2024 06:32:02 PM

ఆక్రమణకు గురవుతున్న ఈదులకుంట చెరువు

గత కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫిర్యాదులకు స్పందించిన హైడ్రా

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ఈదులకుంట చెరువును ఓ రియలేస్టేట్ సంస్థ కబ్జానుండి కాపాడాలని కోరుతూ సీపీఐ(ఎం) శేరిలింగంపల్లి నాయకులు చల్లా శోభన్ (కార్యదర్శి), కొంగరి కృష్ణ, హైడ్రా కమిషనర్ కు పలుమార్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చల్లా శోభన్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, ఖానామేట్ సర్వే నెంబర్ 7 లో (సర్కార్ భూమి) 6 ఎకరాల 5 గుంటల భూమి ఉంది, 1954, 1955 ఖాస్రా పహాణి నుండి నేటి ధరణి వరకు కూడా రెవిన్యూ రికార్డుల్లో చెరువు, ప్రభుత్వ భూమి అని ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో చెరువును కబ్జా చేసి మట్టితో పూడ్చారు తమ్మిడి చెరువు నుండి వచ్చే నాలా ఈదుల కుంటలోకి వస్తుంది కానీ కబ్జాదారులు ఈదుల కుంటలోకి నాలా రాకుండా అక్రమంగా మళ్లించి చెరువులోకి నీళ్లు రాకుండా చేశారు. ఆక్రమణదారులు ఇక్కడ చెరువు లేదు అని బుకాయిస్తూ నిర్మాణ పనులు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవటం లేదు.

ఈ చెరువు వల్ల హైటెక్ సిటీ, మాదాపూర్ చుట్టుపక్కల భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవని, ఇలాంటి కబ్జాలవల్ల భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయన్నారు. వెంటనే స్పందించి చెరువును, విలువైన సర్కారు స్థలాన్ని కాపాడాలని కోరారు. దీనికి స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం ఈదులకుంట చెరువును రెవెన్యూ, ఇరిగేషన్, అధికారులతో కలిసి మరోసారి విస్తృతస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ఈదులకుంట చెరువు ఏ మండల పరిధిలోకి వస్తుంది. ఓవర్ ల్యాపింగ్ ఎలా అయింది గతంలో చేసిన సర్వే వివరాలు,చెరువులో ఎవరు నిర్మాణం చేపట్టారు, వారికి ఉన్న రికార్డులు ఎంటనేది కూకట్ పల్లి, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణదారులకు ఉన్న డాక్యుమెంట్లు గతంలో సర్వే చేసిన రిపోర్ట్ లను పునపరిశీలిన చేసి చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.