అక్రమ నిర్మాణాల విచారణ, చెరువుల సంరక్షణకై హైడ్రా కమిషనర్ హామీ..
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ కాలానీలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు, ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేడిపల్లిలోని వెస్ట్ కమల నగర్ కాలనీలో రోడ్డు కబ్జా చేసి మండపం నిర్మించారని సహజ యోగ ధ్యానం ప్రతినిధి గౌరీ కృష్ణ ఫిర్యాదు మేరకు కమీషనర్ లేఔట్లను పరిశీలించి డెడ్ ఎండ్ రోడ్డు కావడంటో ఎవరికీ ఇబ్బంది కలగకుండా కాలనీ వాసులందరూ వినియోగించుకోవలసిందిగా సూచించారు. నగరంలోని ఆక్రమణలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు నగరవాసుల శ్రేయస్సు కోసం చర్యలు తీసుకుంటామని చట్టవిరుద్ధమైన నిర్మాణాలను అరికట్టడం కోసం హైడ్రా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు.