శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా అధికారులు సిద్దమయ్యారు. శనివారం ఉదయం అయ్యప్ప సొసైటీలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇల్లీగల్ బిల్డింగ్స్, ఆక్రమణలను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్స్ రోడ్డులో నిర్మించిన ఓ ఇల్లీగల్ భవనాన్ని కూల్చివేతకు గతంలోనే హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆ భవనాన్ని డిమాలూషన్స్ చేసేందుకు ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు బిల్డింగ్ దగ్గరకు చేరుకుని కూల్చివేతలకు రంగం సిద్ధం చేశాయి. కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల కోసం డిఆర్ఎఫ్ అధికారులు వేచి చూస్తున్నారు. ఆదివారం ఉదయం సదరు బిల్డింగ్ ను కూల్చివేయనున్నట్లు హైడ్రా సిబ్బంది తెలిపారు.