calender_icon.png 28 September, 2024 | 9:03 PM

ఇళ్ల కూల్చివేతలు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

28-09-2024 05:58:09 PM

అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశాం

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే హైడ్రా

చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యం


హైదరాబాద్: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం సాయంత్రం మూసీ, హైడ్రాపై అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని రంగనాథ్ పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులే అన్న ఆయన సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.  అమీన్‌పూర్‌లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు.

అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారు, భవనంలో ఆసుపత్రి లేకపోయినా ఆస్పత్రి ఉన్నట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారు కమిషనర్ రంగనాథ్ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే ముఖ్యమంత్రి హైడ్రా తీసుకొచ్చారని చెప్పారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యతన్నారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశాం.. దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదని ఆయన చెప్పారు. ప్రజలు నివసిస్తున్న భవనాలను అసలు కూల్చలేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.

ఇటీవల కూకట్ పల్లి నల్లచెరువులో ఆక్రమణలను కూల్చివేశాం.. ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసి 2 నెలలైందని రంగనాథ్ తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం అనేది రాజ్యాంగంలో భాగం, పరిశుభ్రమైన వాతావరణం జీవించే హక్కులో భాగం అన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందిని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తోందని కితాబు ఇచ్చారని చెప్పారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామని కమిషనర్ రంగనాథ్ గుర్తుచేశారు.