calender_icon.png 23 September, 2024 | 4:40 AM

కబ్జాలపై హైడ్రా పంజా

23-09-2024 02:58:19 AM

  1. కూకట్‌పల్లి నల్లచెరువులో ఆక్రమణల తొలగింపు 
  2. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 16 షెడ్లు
  3. అమీన్‌పూర్ మండలంలో భవనాలు కూల్చివేత 
  4. పటేల్‌గూడలో 25 విల్లాలు నేలమట్టం
  5. 8 ఎకరాల భూమిని చెర విడిపించిన హైడ్రా 
  6. నివాసాలను వదిలేసి వాణిజ్య భవనాల కూల్చివేత 

హైదరాబాద్ సిటీబ్యూరో/కూకట్‌పల్లి/పటాన్‌చెరు, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): అక్రమార్కులపై హైడ్రా మరోసారి పంజా విసిరింది. వీకెండ్ వస్తుందంటే చాలు ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పడుతుందని అందరు అనుకున్నట్టుగాగానే కూల్చివేతలు చేపట్టే బుల్డోజర్లతో ఆదివారం తెల్లవారు జామున రంగంలోకి దిగిన హైడ్రా, ఆక్రమణలను నేలమట్టం చేసింది.

కూకట్‌పల్లి నల్లచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన భారీ షెడ్లను, అమీన్‌పూర్ మండలంలోని కిష్టారెడ్డి పేటలో మూడు జీ ప్లస్ ౫ భవనాలు, పటేల్ గూడలోని 25 విల్లాలలను హైడ్రా ఆదివారం కూల్చివేసింది. హైడ్రా ముందు చెప్పినట్టుగానే ప్రజలు నివాసం ఉంటు న్న అక్రమ ఇళ్లను మాత్రం కూల్చివేతల నుంచి మినహాయించింది. ఈ మూడు ప్రాంతాల్లో 44 ఇండ్లను కూల్చివేసి 8 ఎకరాల స్థలాన్ని పరిరక్షించి నట్టుగా హైడ్రా అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కూల్చివేతలను హైడ్రా ఎస్పీ పాపయ్య, డీఎస్పీ శ్రీనివాసరావు, అమీన్‌పూర్ తహసీల్దార్ రాధ, పటాన్‌చెరు డిఎస్పీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షించారు. 

నల్లచెరువులో 16 షెడ్లు కూల్చివేత 

కూకట్‌పల్లి నల్లచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు పలుమార్లు పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని భావించారు. బాలానగర్ మండలం కూకట్‌పల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 66, 67, 68, 69లో నల్ల చెరువు మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మొత్తం 7 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు. వీటిలో ఎఫ్‌టీఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉండగా.. 4 ఎకరాల బఫర్ జోన్‌లో 50కి పైగా భవనాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో ముందుగా హైడ్రా చెప్పినట్టుగా నివాస భవనాలను కూల్చకుండా వదిలేశారు. పలువురు అద్దెకు తీసుకుని క్యాటరింగ్ వ్యాపారం చేసుకుంటున్న 16 షెడ్లను మాత్రం కూల్చివేశారు. ఆక్రమణదారులు పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నా నిర్దాక్షిణ్యంగా షెడ్లను కూల్చివేశారు. 

కిష్టారెడ్డిపేటలో 3 భవనాలు కూల్చివేత 

అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలో సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మూడు జీ ప్లస్ 5 భవనాలను హైడ్రా అధికారులు ఆదివారం నేలమట్టం చేశారు. వీటిలో 2 కమర్షియల్ భవనాలు, ఒకటి రెసిడెన్సియల్ భవవం ఉన్నాయి. వీటిని రెండేండ్లుగా నిర్మిస్తున్నారు. గతంలో వీటికి అధికారులు మూడు సార్లు నోటీసులు ఇవ్వగా, 2 సార్లు కూల్చివేశారు. అయినా సదరు నిర్మాణదారులు భవనాలను పూర్తి చేయడం విశేషం. వాస్తవానికి ఈ నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలోని సర్వే నంబర్ 164లో చేపట్టగా, సర్వే నంబర్ 165 లో నిర్మాణాలు చేపడుతున్నట్టుగా ఆక్రమణదారులు కోర్టును తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తుంది.

అయితే, నోటీసులు ఇచ్చి, కూల్చివేసిన అధికారులపై నిర్మాణాదారులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా.. తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు కోర్టులో జరిమాన చెల్లించాల్సి వచ్చినట్టు అధికారులు వాపోతున్నారు. ఇక్కడ కూల్చివేసిన 2 కమర్షియల్ భవనాల్లో ఒక భవనానికి చెందిన యాజమాని నేపాల్ దేశంలోని మాదేశ్ ప్రావిన్స్ రాష్ట్ర సీఎం అల్లుడుగా తెలుస్తుంది. ఈ ఆక్రమణలను తొలగించి ఎకరం స్థలాన్ని అధికారులు రక్షించారు. దీని విలువ దాదాపు రూ.80 కోట్లు ఉంటుందని అంచనా. 

పటేల్‌గూడలో 25 విల్లాలు కూల్చివేత

పటేల్‌గూడలోని 12/2, 12/3 సర్వే నంబర్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 విల్లాలను (జీ ప్లస్ అప్పర్ ఫ్లోర్) నిర్మించారు. వీటి నిర్మాణాన్ని కలెక్టర్ హనుమంతరావు హయాంలో నిలిపివేయగా, అనంతరం వచ్చిన అధికారుల అలసత్వంతో ఆక్రమణదారులు నిర్మాణాలు పూర్తిచేశారు. ఈ ఆక్రమణలను తొలగించడంతో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు రక్షించారు. వాస్తవానికి ఇక్కడికి సమీపంలోనే సర్వే నంబర్ 6లోని ప్రైవేటు స్థలంలో బీఎస్‌ఆర్ కాలనీ 2012లో ఏర్పాటయ్యింది. అయితే, పటేల్‌గూడలోని 25 విల్లాలను సదరు నిర్మాణాదారులు ఈ స్థలాన్ని సర్వే నంబర్ 6గా (ప్రైవేటు స్థలంగా) చెప్పి విక్రయించారు. దీంతో కొనుగోలు చేసినవారంతా మోసపోయి లబోదిబొమంటున్నారు. 

కాస్త టైం ఇస్తే ఖాళీ చేసేవాళ్లం: మానస, బాధితురాలు 

మేం రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బుతో వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాం. ఈ షెడ్డుల్లో కిరాయికి ఉంటున్నాం. ప్రతి నెలా అద్దెలు చెల్లిస్తున్నాం. కనీసం మాకు 6 నెలలు అయినా టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్లిపోయే వాళ్లం. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయ్. ఎక్కడికి పోవాలే. పెద్దపెద్ద భవంతులు కట్టినోళ్లను వదిలేసి షెడ్డుల్లో ఉన్నోళ్లను రోడ్డున పడేస్తారా? పోలీసుల కాళ్లా.. వేళ్లా పడినా కనికరించ లేదు. మేం ఇళ్లల్లో లేని సమయంలో మా ఇళ్లను కూల్చివేయడం దారుణం.

మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు: గుగులోత్ రవి, బాధితుడు 

మేం కొద్ది కాలంగా ఈ షెడ్లను కిరాయికి తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాం. అధికారులు చెప్తున్నట్టుగా ముందస్తుగా మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మా ఇంట్లో సామగ్రి తీసుకునే సమయం కూడా ఇవ్వకపోవడం అన్యాయం. ఇప్పుడు మా బతుకులన్నీ రోడ్డు పాలయ్యాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు మేమెక్కడికి పోవాలి