- హైడ్రా యాక్షన్‌తో నిలిచిన విక్రయాలు
- డబ్బులు వెనక్కి ఇవ్వాలని కస్టమర్ల ఒత్తిడి
- ప్రశ్నార్థకంగా లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్ల భవితవ్యం
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): నగరంలోని బిల్డర్లకు హైడ్రా గుబులు పట్టుకుంది. ముఖ్యంగా చెరువు ఒడ్డున అపార్ట్‌మెంట్స్, డూప్లెక్స్, ఇండిపెండెంట్ ఇండ్లను నిర్మించే బిల్డర్ల వెన్నులో వణుకు పుడుతోంది. మహానగరంలో లేక్ వ్యూ ఇళ్లకు భారీ డిమాండ్ ఉండేది. అయితే హైడ్రా ఎఫెక్ట్‌తో పరిస్థితి మారిపోయింది. లేక్ వ్యూ ఇళ్లంటేనే కొనుగోలుదారులు ఆమడదూరం వెళ్తున్నారు. లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల వద్దకు హైడ్రా బుల్డోజరు ఎప్పుడు వస్తుందోన్న భయంతో గడుపుతున్నారు.
దీంతో చెరువులకు సమీపంలో లేక్‌వ్యూ పేరుతో అపార్ట్‌మెంట్స్, డూప్లెక్స్ విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మించిన బిల్డర్లు తలలు పట్టుకుంటున్నారు. దాదాపుగా నిర్మాణం పూర్తయిన ఫ్లాట్ల వైపు బిల్డర్లు కన్నెత్తి చూడకపోవడంతో బిల్డర్లలో ఆందోళన షురూ అయ్యింది. హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది.
ముఖ్యంగా చెరువులను, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా హైడ్రా కూల్చేస్తోంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ వంటి ప్రభుత్వ అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా నేలమట్టం చేస్తుండటంతో బిల్డర్లలో ఆందోళన నెలకొంది. హైడ్రా స్పీడ్ పెంచడంతో లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్స్ నిర్మించిన బిల్డర్లకు కంటిమీద కునుకులేకుండా పోయింది.
మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో చెరువుల సమీపంలో ఉన్న నివాస ప్రాజెక్టుల్లోని ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. చెరువులకు దగ్గరగా ఉన్న నివాస ప్రాజెక్టుల్లో మంచి లేక్‌వ్యూ ఉంటుందని ఫ్లాట్ కొనుగోలు చేసిన సంతోషం లేకుండా పొయిందని కొందరు భవన యజమానులు పేర్కొంటున్నారు.
డిమాండ్ ఎక్కువగా ఉండేది..
చెరువులకు సమీపంలోని నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టుల్లోని ఇళ్లకు గతంలో భారీ డిమాండ్ ఉండేది. మంచి లేక్‌వ్యూతో ఉండే ఫ్లాట్స్, విల్లాలకు ధర కూడా కాస్త ఎక్కువే. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే చెరువులకు దగ్గరగా లేక్‌వ్యూ ఇల్లు అంటే ఎవరై నా ఆసక్తి చూపుతారు. అపార్ట్‌మెంట్ లేదా విల్లాలు నిర్మాణ దశలో ఉండగానే పోటీ పడి మరీ లేక్ వ్యూ ఫ్లాట్స్, విల్లాలను బయ్యర్లు కొనుగోలు చేస్తుంటారు. దీంతో లేక్‌వ్యూ ఫ్లాట్స్, విల్లాలకు మిగతా ఇళ్లతో పోలిస్తే ధరలు సైతం కాస్త ఎక్కువగానే ఉంటాయి.
ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నిన్నటివరకు లేక్ వ్యూ ఫ్లాట్ కోరుకున్న వారంతా ఇప్పుడు లేక్‌వ్యూ అంటే చాలు పెదవి విరుస్తున్నారని బిల్డర్లు వాపోతున్నారు. హైడ్రా ప్రభా వంతో హైదరాబాద్‌లో లేక్ వ్యూ ప్రాజెక్టుల్లోని ఫ్లాట్స్‌ను, విల్లాలను ఎంతకో కొంత కు అమ్ముకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కొత్తగా లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు కొనేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదని బిల్డర్లు వాపోతున్నారు. లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు ఉన్నవాళ్లే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే ఇంకా కొత్తగా కొనేదెవరని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో 25వేల ప్రాజెక్టులు..
హైదరాబాద్‌లో చెరువులకు దగ్గర గా, చెరువులకు ఎదురుగా లేక్ వ్యూ కాన్సెప్ట్‌తో చెరువులకు సమీపంలో సుమారు 25 వేల గృహాలను నిర్మించిన ట్లు ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి తెలిపారు. సాధారణంగా ఈస్ట్ ఫేస్‌లో ఉండే ఫ్లాట్స్ కంటే లేక్‌వ్యూతో ఉండే ఫ్లాట్స్‌కు చదరపు అడుగుకు ప్రాజెక్టును బట్టి 300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పు డు హైడ్రా ప్రభావంతో ఎక్కువ ధర సంగతి పక్కన పెడితే అసలు లేక్‌వ్యూ ఇళ్లు కొనేవారే కరువయ్యారని బిల్డర్లు వాపోతున్నారు. లేక్‌వ్యూతో ఉన్న ఇళ్లను అమ్ముకునేదెలా అని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు.