calender_icon.png 29 September, 2024 | 4:48 AM

కాంగ్రెస్ పార్టీపై హైడ్రా బాంబ్!

29-09-2024 02:47:59 AM

తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచినట్టు మారింది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. చెరువుల ఆక్రమణలు తొలగిద్దామని, మూసీ సుందరీకరణ చేద్దామని భావించిన రేవంత్ సర్కార్‌కు మధ్యతరగతి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. హైడ్రా ద్వారా చెరువులు, కుంటలు, మూసీ పరివాహక ప్రాంతాల్లోని అనుమతి లేని ఇండ్లను ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్న తీరుపై ప్రజల్లో నుంచి తీవ్ర ఆగ్రహంవ వ్యక్తమవుతున్నది.

ప్రభుత్వ నిర్ణయం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉరి లాగా మారనుందనే చర్చా జరుగుతోంది. అప్పోసప్పో చేసి, నెలకింత బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న ఆశల సౌదాలను కూల్చేయడంతో రేవంత్ సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ప్రభుత్వాలు మంచి చేయకున్నా పర్లేదు కానీ, ఇలా అన్యాయం చేయకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.2 లక్షల రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న మంచి పేరు కాస్త.. హైడ్రాతో చెరిగిపోయిందనే మూసీలో కలిసిందనే ప్రచారం జరుగుతోంది.