calender_icon.png 22 September, 2024 | 8:06 PM

అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు

08-09-2024 01:25:48 PM

అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్ టి ఎల్ లో అక్రమ నిర్మాణాల తొలగింపు 

పటాన్‌చెరు: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు, కుంటలు అన్యాక్రాంతం చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించింది. అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లలో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు రెవెన్యూ, మునిసిపాలిటీ అధికారుల సమన్వయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. 

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో వాణి నగర్, హెచ్ యంటి కాలనీలో చెరువు సర్వే నంబర్ 323, 324, 325 లలోని ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్ చెరు పర్యటన చేపట్టిన వారం తర్వాత కూల్చివేతలకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే  పెద్ద చెరువు ఎఫ్ టీ ఎల్,బఫర్ జోన్ లో వెలసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా మున్ముందు కూడా ఈ కూల్చివేతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.