- మన బిర్యానీకి ప్రపంచ గుర్తింపు
- గల్లీ నుంచి ఢిల్లీ దాకా
- 100 అత్యుత్తమ వంటకాల్లో 31వ స్థానం
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): బిర్యానీ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే బిర్యానీ. మన బిర్యానీ రుచికి ఫిదాకానివారే ఉండరు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరైనా సరే మన భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు బిర్యానీ రుచి చూడందే తిరిగి వెళ్లరంటే అతిశయోక్తి కాదు.
బిర్యానీ తయారీ విధానం, రెసిపీ, అందులో వినియోగించే మసాలా దినుసుల క్వాలిటీ వల్లే ఆ రుచి అబ్బింది. అందుకే మన బిర్యానీ దేశవిదేశాల్లో ఫేమస్ అయ్యింది. తాజాగా మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నది. ప్రపంచంలో టాప్ 100 అత్యుత్తమ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ చోటు దక్కించుకుంది. అది కూడా 31వ స్థానం కావడం విశేషం. ప్రముఖ గ్లోబల్ ట్రావెల్ అండ్ ఫుడ్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది.
బిర్యానీ.. నిజాం కిచెన్ నుంచి తయారైన వంటకం. అందరికీ ఇష్టమైన ఫుడ్. బిర్యానీని బాస్మతి బియ్యం, లేత మాంసంతో తయారుచేస్తారు. ఈ వంటకం హైదరాబాద్‌లోనే అత్యంత రుచికరమైన వంటకంగా పేరొందింది. అయితే ఎన్నో రకాల బిర్యానీలు దేశవిదేశాల్లోని రెస్టారెంట్లు, స్ట్రీట్ షాపుల్లో అందుబాటులో ఉన్నా..
హైదరాబాద్ బిర్యానీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులను ఆకర్షిస్తూనే ఉంటుంది. 11,258 ఫుడ్ ఐటమ్స్ మొత్తంగా 3,67,847 మంది నుంచి రేటింగ్స్ తీసుకుంది. దీనిని పరిశీలించి 100 అత్యుత్తమ వంటకాల జాబితాను రూపొందిస్తే.. ఇందులో హైదరాబాద్ బిర్యానీకి 4.52 రేటింగ్ వచ్చింది.
బిర్యానీతోపాటు మరో మూడు మన దేశపు వంటకాలు :
- ముర్గ్ మఖానీ (29వ ర్యాంక్)
- చికెన్ 65 (ర్యాంక్ 97)
- కీమా (100వ ర్యాంక్)