calender_icon.png 15 January, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ x అమరావతి

06-07-2024 01:20:37 AM

  1. అనుమతుల కోసం వేచి చూస్తున్న కొన్ని కంపెనీలు
  2. ఊగిసలాటలో ఉన్న సంస్థలను ఆకర్షించేందుకు ఏపీ ప్రయత్నం

హైదరాబాద్, జూలై ౫ (విజయక్రాంతి): ఓ వైపు పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇండస్ట్రీ పాలసీలను తీసుస్తుంటే మరోవైపు ఇక్కడి సంస్థలను తమ వైపు తిప్పుకునేందుకు ఏపీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైద రాబాద్‌లో ఇండస్ట్రీలను ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపుతున్న కొన్ని కంపెనీలతో పొరుగు రాష్ట్రం అధికారులు సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఏపీ నుంచి తీవ్రమైన ప్రయత్నాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న బడా కంపెనీల పేర్లను బయటకు చెప్పేందుకు కూడా పారిశ్రామిక వర్గాలు ఆలోచిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలా? మరో చోటుకు వెళ్లాలా? అని ఊగిసలాటలో ఉన్న కంపెనీలు, విస్తరణలో భాగంగా రాష్ట్రంలో భూ సమస్యలను ఎదుర్కొంటూ అనుమతుల విషయంలో ఇబ్బందులు పడుతున్న కొన్ని సంస్థలను తమ వైపు తిప్పుకునేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకుని తాము అలర్ట్ అయి నట్లు తెలంగాణ పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణకు వచ్చిన, రావాలను కుంటున్న పరిశ్రమలు ఎటూ తరలిపోకుండా ఉండేందుకు పరిశ్రమల శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ వ్యాపారం విస్తరించాలనుకుంటున్న సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తమ డాటా సెంటర్ల విస్తరణకు ఎదురవుతున్న భూ సమస్యలను పరిష్కరించాలని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఇటీవల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కోరగా ఆయన వెంటనే స్పందించారు. సమస్యకు సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వచ్చే వారానికల్లా సమస్యలను పరిష్కరించే దిశగా అటు టీజీఐఐసీ, ఇటు రంగారెడ్డి కలెక్టర్ కసరత్తును ప్రారంభించారు.

రాయితీల వల వేస్తున్న ఏపీ!

ఏపీలో ఇటీవల ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమ రాష్ట్రంలోకి పరిశ్రమలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఐటీ మంత్రి లోకేశ్ అమరావతికి పెట్టుబడులను తేవడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులను పెట్టే కంపెనీలకు భారీస్థాయిలో రాయితీలను ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఊగిసలాటలో ఉన్న కంపెనీలను తమవైపు మళ్లించుకోవచ్చనే యోచనలో ఏపీ సర్కారు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని కంపెనీలను ఉద్దేశించే పొరుగు రాష్ట్రం ఈ రాయి తీల వల వేస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి తెలంగాణలో రెండు బడా కంపెనీలు పెట్టేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఆ చర్చలు దాదాపు తుది దశకు వచ్చాయి. వచ్చే నెలలో ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడి కంపెనీలను ఏపీ ఆకర్షిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ రెండు బడా కంపెనీల పేర్లు చెప్పేందుకు కూడా పారిశ్రామిక వర్గాలు నిరాకరిస్తున్నాయి. ఆ పేర్లను బహిర్గతం చేస్తే ఏపీ భారీ రాయితీలు ఇచ్చి తమ వైపు ఎక్కడ మళ్లించుకుంటుందేమో అని ఆలోచిస్తున్నాయి. అందుకే ఎంవోయూ కుదిరిన తర్వాత ఆ రెండు కంపెనీల వివరాలను వెల్లడిస్తామని పరిశ్రమవర్గాలు చెప్పాయి.

ఆలోచిస్తున్న పారిశ్రామికవేత్తలు 

2014లో ఏపీ విభజన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దీంతో చాలామంది పారిశ్రామిక వేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భూములు కొన్నారు. కానీ 2019లో జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానులను ప్రకటించడంతో అమరావతిలో అభివృద్ధి కుంటు పడింది. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కావడం లేదు. కొత్త సర్కారు భారీ ఆఫర్లు ఇస్తుందని హడావుడిగా అక్కడ పెట్టుబడులు పెడితే భవిష్యత్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అనే కోణంలో పారిశ్రామిక వేత్తలు ఆలోచిస్తున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తెస్తే పరిస్థితి ఏంటని అనుమానిస్తున్నారు. అందుకే అమరావతిలో రాజధానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన పూర్తయిన తర్వాతే అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పారిశ్రామిక వేత్తలు పరిశీలించే అవకాశం కనిపిస్తోంది.

రూ.5 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యం 

తెలంగాణను పారిశ్రామికంగా అగ్రస్థానం లో నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడిదారులను ఆకర్షించేదుకు ఆరు పాలసీలను తీసుకొస్తుంది. నూతన విధానాల తెలంగాణలో రూ.2.5లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులను వచ్చే వచ్చే నాలుగున్నర ఏళ్లలో రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో సర్కారు పని చేస్తోంది.