నేడు గుజరాత్‌తో హైదరాబాద్ ఢీ
ఉప్పల్ వేదికగా మ్యాచ్
గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 17వ సీజన్‌లో మాత్రం అంచనాలకు భిన్నంగా రాణిస్తూ దుమ్మురేపుతుంది. టైటిల్ కొట్టడమే లక్ష్యంగా సీజన్‌లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ మరొక్క విజయం సాధిస్తే దాదాపు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టినట్లే. ఓటమితో సీజన్‌ను ఆరంభించినప్పటికి ఆ తర్వాత గేర్ మార్చిన రైజర్స్ భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అయితే సొంత ఇలాకాకు చేరుకోగానే మళ్లీ గాడిలో పడిన రైజర్స్ గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది. మరి ఉప్పల్ వేదికగా సొంత అభిమానుల మధ్య రైజర్స్ దుమ్మురేపి సగర్వంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలని ఆశిద్దాం!
విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి: ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్ బెర్త్ లక్ష్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై కీలకపోరుకు రెడీ అయింది. ఉప్పల్ వేదికగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్ అమితుమీ తేల్చుకోనుంది. సీజన్‌లో హైదరాబాద్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ జంట ప్రళయం సృష్టించింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు ప్రత్యర్థులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోని రైజర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరు మరోసారి బ్యాట్‌ను ఝలిపిస్తే గుజరాత్ కష్టాల్లో పడినట్లే. హెన్రిచ్ క్లాసెన్ మాస్ హిట్టింగ్‌కు తోడు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్‌లు భారీ షాట్లతో బెంబెలెత్తిస్తున్నారు.
ఇక మార్కరమ్, షాబాజ్ అహ్మద్‌లు క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలో భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్‌లతో రైజర్స్ పేస్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన గుజరాత్ టైటాన్స్‌కు రైజర్స్‌తో మ్యాచ్ నామమత్రమే కానుంది. కోల్‌కతాతో జరగాల్సిన గత మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకపోవడంతో గుజరాత్ ఆశలు గల్లంతయ్యాయి. మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యే చాన్స్ ఉంది. బ్యాటింగ్‌లో గిల్, సాయి సుదర్శన్, మిల్లర్ మినహా మిగతావారు రాణించడంలో విఫలమవుతున్నారు. గుజరాత్ బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా కనిపిస్తోంది. మోహిత్ శర్మ, రవి బిష్ణోయి, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌లు రాణిస్తుండడం సానుకూలాంశం. సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో టైటాన్స్ విజయం సాధించింది.