వచ్చే నెలలో టెండర్లు
ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి
ఎస్సెల్బీసీ పనులకు రూ.2,200 కోట్లు
మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, జూలై 21 (విజయక్రాంతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరులేన్ల విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపిందని.. వచ్చే నెలలో పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నాటికి అర్హులందరికీ రైతు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. నార్కెట్‌పల్లి మండలం గోపలాయ పల్లిలోని వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగసహిత రుద్రయాగంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని తెలిపారు.
ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సెబ్బీసీ పనుల పూర్తికి ప్రభుత్వం రూ.2,200 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. రైతు రుణమాఫీలో భాగంగా ఒకేరోజు రూ.6వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు సర్కారు కట్టుబడి ఉందన్నారు. వేణుగోపాలస్వామి ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 2 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. చెరువుగట్టులో 100 కాటేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, డీఎస్పీ శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.