- టెక్, ఇన్నోవేషన్, స్టార్టప్స్‌కు కేరాఫ్ అడ్రస్
- ఆరిక్ట్ ఇన్నోవేషన్ హబ్‌తో 300 కొత్త ఉద్యోగాలు
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ అంటేనే టాలెంట్ సిటీ అని, టెక్, ఇన్నోవేషన్, స్టార్టప్స్‌కు కేరా ఫ్ అడ్రస్ అని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. సాఫ్ట్‌వేర్ రం గంలోనే కాదని ఫార్మా, బయోటెక్ తదితర రంగాల్లోనూ హైదరాబాద్ కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు.
అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఆరిక్ట్ (ఏఆర్‌ఐక్యూటీ) సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో నైపుణ్యమున్న మానవ వనరులకు తెలంగాణ చిరునామాగా నిలువబోతోందని చెప్పారు. ఆరిక్ట్ ఫెసిలిటీ వల్ల 300 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
గత రెండు దశాబ్దాల కాలంలో ఐటీ రంగం సాధించిన విప్లవాత్మక వృద్ధి వల్ల రాష్ర్ట జీడీపీ, తలసరి ఆదాయం జాతీయ సగటును మించిపోయిందన్నారు. తెలంగాణలో ఐటీ వార్షిక ఎగుమతులు 30 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ర్టంలో 6,000 అంకుర సంస్థలు, చిన్న, మధ్య తరహా సాఫ్ట్‌వేర్ సంస్థలు 1,500 వరకు ఉన్నాయని, ప్రముఖ సంస్థలు తమ జీసీసీలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నట్లు వెల్లడించారు.
దీని వల్ల ప్రతిభావంతులైన యువతకు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతున్నాయని వివరించారు. ఎప్పటికప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ.. ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలనుకునే కంపెనీలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు.
ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆరిక్ట్ సీఈవో రూపేశ్ కుమార్, ఐటీ శాఖ మంత్రి సలహాదారు సాయికృష్ణ, తెలంగాణ ఐటీ వ్యూహకర్త శ్రీకాంత్ లంక తదితరులు పాల్గొన్నారు.