హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): వచ్చే పదేళ్లలో హైదరాబాద్ గ్లోబల్ స్కిల్స్ క్యాపిటల్‌గా అవతరించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీ ద్వారా భవిష్యత్‌లో ఐటీతో పాటు అన్ని రంగాల్లోని నిపుణులను తయారు చేయనున్నట్టు ప్రకటించారు.
జిల్లాల్లోనూ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. శుక్రవారం పెర్సియల్ గ్రూప్‌కు చెందిన గ్లోబల్ క్యాపాబులిటీ సెంటర్(జీసీసీ)ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. కెనడాకు చెందిన ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా భారత్‌లో డార్క్‌మాటర్ టెక్నాలజీస్ పేరుతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
జీసీసీ ప్రారంభం సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందని.. దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా 400 జీసీసీ కేంద్రాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశీయ దిగ్గజ కార్పొరేట్ కంపెనీలకు ఇక్కడ ఆఫీసులు ఉన్నాయన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు సైతం గ్లోబల్ స్థాయికి విస్తరిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఇండియా జీసీసీల ఎకానమీ 46 బిలియన్ డాలర్లు అని, అది 2030 నాటికి జీసీసీ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 100 బిలియన్ డాలర్లలో తెలంగాణ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అలాగే, జీసీసీలకు సంబంధించి దేశంలోనే అత్యధిక మంది నిపుణులను అందించే ప్రాంతంగా హైదరాబాద్ ఉంటుందన్నారు. హెల్త్, లైఫ్ సైన్సెస్ సెక్టార్‌తో పాటు బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్లపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఫార్చ్యూన్ 500లోని ఎక్కువ కంపెనీలను ఆకర్షించడమే తమ లక్ష్యమన్నారు.
బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని, ఏటా లక్ష మంది నిపుణులను ఈ రంగానికి అందించడమే లక్ష్యంగా పని చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిపుణులను అందించేందుకే తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు వివరించారు.
33 విభాగాలను యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందులో బ్యాంకింగ్, లైఫ్‌సైన్సెస్, హెల్త్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి విభాగాల్లో నిపుణులను తయారు చేయనున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులను పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ రాష్ట్రానికి 20 వేల మంది బీఎఫ్‌ఎస్‌ఐ నిపుణుల అవసరం ఉన్నదన్నారు.
అందుకోసం ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన వారికి యూనివర్సిటీలో రెండో ఏడాది నుంచే బీఎఫ్‌ఎస్‌ఐకు సంబంధించిన సబ్జెక్టు ఒకటి ఉండేలా కరికులమ్‌ను రూపొందించినట్లు చెప్పారు. యంగ్ యూనివర్సిటీ నుంచి వచ్చే వారు ట్రైనింగ్ తీసుకోకుండా నేరుగా ఉద్యోగాలు చేసేలా నిపుణులను తీర్చిదిద్దుతామన్నారు.
చైనా డీప్ సీక్ ఏఐని రూపొందించిందని, తెలంగాణ యువత కూడా నైపుణ్యాలను పెంచుకొని కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. అందుకు రాష్ట్రప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టంచేశారు. 750 మందితో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేసిన పెర్సియస్ గ్రూప్ 2027 నాటికి 2,250 ఉద్యోగాలను కల్పించనుంది.
డార్క్‌మాటర్ జీసీసీ ఏర్పాటుతో గ్లోబల్ ఏఐ పవర్ హౌస్ హైదరాబాద్ ఆవర్భివించింది. కార్యక్రమంలో పెర్సియస్ గ్రూప్ ప్రెసిడెంట్ స్కాట్ స్మిత్, డార్క్‌మ్యాటర్ ఎండీ రవివర్మ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ అడ్వైజర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.