హైదరాబాద్: గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సాధారణ స్థితికి వస్తోందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కొందరు శోభాయాత్రను అర్ధరాత్రి, ఆ తర్వాత మొదలు పెడుతున్నారన్న సీపీ ఇలా చేయడం వల్ల గణేష్ విగ్రహాల నిమజ్జనాలు పూర్తవుడానికి మరుసటి రోజు వరకు సమయం పడుతోందని చెప్పారు. దీనివల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది నుంచైనా ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. 11వ రోజే నిమజ్జనాలు పూర్తయ్యేలా తరలిరావాలని సీపీ సీవీ ఆనంద్ కోరారు. వేలాది విగ్రహాల నిమజ్జనాన్ని వేగవంతం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు, ఇతర విభాగాల్లోని 25 వేల మంది సిబ్బంది రాత్రంతా రెండు షిఫ్టుల్లో నిరంతరం శ్రమించారని నగర పోలీస్ కమిషనర్ బుధవారం తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ ఘాట్, పీపుల్స్ ప్లాజాలో విగ్రహాల నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు.