calender_icon.png 23 November, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టాల్లో హైదరాబాద్ మెట్రో

23-11-2024 12:13:05 AM

  1. ఏడేండ్లలో రూ.6వేల కోట్ల మేర నష్టాలు
  2. పెరుగుతున్న నిర్వహణ భారం, ఖాళీగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు
  3. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో తగ్గిన మహిళా ప్రయాణికులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): నగర ప్రజా రవాణా వ్యవస్థలో మణిహారమైన హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య ఓవైపు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ మరోవైపు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్‌అండ్‌టీ, ఎంఆర్‌హెచ్‌ఎల్ మాత్రం..

నిర్వహణ భారం పెరగడం, మహిళలకు ఫ్రీబస్సుతో ఆశించిన మేర ప్రయాణికులు సర్వీసులను ఉపయోగించుకోకపోవడంతో కంపెనీ నష్టాల్లో ఉందంటూ ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ఆ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. నగరంలో 2017లో ప్రారంభమైన మెట్రో సర్వీసులు అనతికాలంలోనే ప్రయాణికుల మన్ననలు పొందడంతో ప్రతి ఏడాది ప్రయాణికుల రద్దీ పెరుగుతూ వస్తోంది.

ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు 5లక్షల మంది నగరవాసులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో రైలులో కాలుమోపాలంటే కూడా ప్లేస్ ఉండని పరిస్థితి ఉంది. నగరంలో 57 మెట్రో స్టేషన్లు ఉండగా.. వాటిలోని చాలా స్టేషన్లలో కమర్షియల్ కాంప్లెక్స్‌లున్నాయి.

వాటిని ఎల్‌అండ్‌టీ సంస్థ పలు షాపులు, సంస్థలకు లీజుకు ఇస్తోంది. దీనికితోడు నగరంలోని పలుచోట్ల పెయిడ్ పార్కింగ్‌లను నిర్వహించడం, పలు స్టేషన్లకు వివిధ సంస్థల పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించినప్పటికీ సంస్థ నష్టాల్లో నడుస్తోందని చెబుతోంది. 

ఏడాదికి రూ.1300కోట్ల నష్టం..

దేశంలోని పలు నగరాల్లో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించింది. అయితే కేవలం హైదరాబాద్‌లో మాత్రమే మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించడంతో పాటు మెట్రో సర్వీసులు, వ్యవహారాలను కూడా ఆ సంస్థే చూసుకుంటోంది. నగరంలోని మెట్రో నిర్మాణంలో 90శాతం వాటా ఎల్‌అండ్‌టీ సంస్థదే.. నిర్మాణ పనులకు సంబంధించి ఎల్‌అండ్‌టీ సంస్థ మెజార్టీ పెట్టుబడులను బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం 10శాతం వాటాగా భూములు, ఇతర సహకారాన్ని అందించింది. కాగా మెట్రో ఆరంభం నుంచే ఎల్‌అండ్‌టీని నష్టాలు వెంటాడుతున్నాయనే ఆరోపణలున్నాయి. కోవిడ్ సమయంలో దాదాపు నాలుగు నెలలకు పైగా మెట్రో సర్వీసులు నిలిచిపోవడం ఆ సంస్థ నష్టాలను భారీగా పెంచింది.

ప్రతి సంవత్సరం దాదాపు రూ.1300కోట్ల వరకు నష్టాలు వస్తుడటంతో ఏడేండ్లలో దాదాపు రూ.6వేల కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు ఇటీవల ఒక సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఎల్‌అండ్‌టీ సంస్థకు ప్రయాణికుల టికెట్లు, మెట్రో స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లోని మెట్రో షాపుల లీజుల ద్వారా ఆదాయం సమకూరాలి.

కానీ వీటినుంచి ఆశించిన మేరకు ఆదాయం రావడం లేదు. మెట్రో షాపుల లీజు ధరలు ఎక్కువగా ఉండటం, మెట్రో ప్రయాణికులు తప్ప ఆ షాపులకు ఇతర వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారులు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది.

వాస్తవానికి మొదట్లో మైటాస్ సంస్థ హైదరాబాద్ మెట్రో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నప్పటికీ 2009లో అర్ధంతరంగా ఒప్పందం విరమించుకోవడంతో.. 2010 సెప్టెంబర్ 4న ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఆ బాధ్యతలు చేపట్టింది. తదనంతరం ఎల్‌అండ్‌టీ మెట్రో నిర్మాణ పనులను పూర్తిచేసినప్పటికీ నిర్వహణలో నష్టాలను చవిచూస్తోంది. 

మహిళలకు ఫ్రీ బస్సుతో తగ్గిన ప్రయాణికులు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కూడా మెట్రోలో ప్రయాణికులు తగ్గడానికి ఒక కారణమై ఉండవచ్చని.. ఫ్రీబస్సు కారణంగా దాదాపు ఒకటి నుంచి ఐదు శాతం వరకు మహిళా ప్రయాణికులు తగ్గి ఉండవచ్చని సమాచారం. ఇదే విషయమై ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో మెట్రోరైల్ ఎండీ కేవీబీరెడ్డి కూడా ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.

దీనికి తోడు మెట్రోల్లో అదనపు బోగీలు లేకపోవడం కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఆయా కారణాల వలన ఆశించిన మేర ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదని... వాస్తవానికి ఇప్పటివరకు రోజుకు దాదాపు ప్రతిరోజు 7లక్షల మంది ప్రయాణికులుండాలని.. కానీ ప్రస్తుతం రోజుకు 5లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తుండటంతో సంస్థ నష్టాలను చవిచూస్తున్నట్లు సమాచారం.