- జాబితాలో భాగ్యనగరానికి ఐదో స్థానం
- మొదటి స్థానంలో బెంగుళూరు, మూడో స్థానంలో ఢిల్లీ, 8వ స్థానంలో ముంబై
- అంచనా వేసిన గ్రోత్ హబ్స్ ఇండెక్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి): సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 2033 నాటికి టాప్ టెన్ నగరాలపై అంచనా వేసింది. వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో హైదరాబాద్‌కు చోటు లభించింది. సావిల్స్ సంస్థ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ జీడీపీ, వ్యక్తిగత సంపద, జనాభా పెరుగుదల, వలసలను ఆధారంగా తీసుకొని అంచనా వేసి ఆర్థిక పరిపుష్టి సాధించే నగరాలను ర్యాంకింగ్ చేస్తుంది.
ఈ జాబితాలో ఇండియాకు చెందిన నాలుగు నగరాలు టాప్ టెన్‌లో నిలిచాయి. బెంగుళూరు మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఐదో ప్లేస్ సాధించింది. భారత దేశ వాణిజ్య రాజధాని ముంబాయి 8వ స్థానంలో ఉంది. భారత్‌లోని నాలుగు నగరాలు 2033 నాటికి 68 శాతం కన్నా ఎక్కువ పెరుగుదలతో గణనీయమైన జీడీపీ సాధిస్తాయి.
అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌లు, నైపుణ్యం కలిగిన యువత, శ్రామిక శక్తి తదితరాలు హైదరాబాద్‌ను ప్రపంచ భవిష్యత్ నగరాల జాబితాలో నిలపడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. రానున్న రోజుల్లో పట్టణీకరణ మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణాలకు వలస రావడం వల్ల ప్రతిభావంతులకు కొదవ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
2033 నాటికి వరల్డ్ టాప్ 10 నగరాలు ఇవే..
1. బెంగుళూరు భారతదేశం
2. హో చి మిన్ సిటీ వియత్నాం
3. ఢిల్లీ భారతదేశం
4. షెన్‌జెన్ చైనా
5. హైదరాబాద్ భారతదేశం
6. హెనోయి వియత్నాం
7. గ్వాంగ్‌జౌ చైనా
8. ముంబాయి భారతదేశం
9. మనీలా ఫిలిప్పిన్స్
10. రియాద్ సౌదీ అరేబియా