11-12-2024 01:01:01 AM
* ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): జీసీసీ, ఏఐ రంగాలకు హైదరాబాద్ యావత్ ప్రపంచానికి గమ్యస్థానంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ ఐబీ సీ), తెలంగాణ (భారత్) మధ్య ద్వుపాక్షిక వా ణిజ్య ఒప్పంద సమావేశంలో మంత్రి మా ట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ముందు హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలో ఏఐ రంగానికి అవసరమైన మౌలిక వసతులు, ప్రతిభతో కూడిన మానవ వనరులు ఉన్నాయన్నారు.
జీసీసీల ఏర్పాటుకు ప్రపంచస్థాయి ఎకో సిస్టమ్ సృష్టించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు. దిగ్గజ ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సెన్సైస్ జీసీసీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, భవిష్యత్తులో సిలికాన్ సిటీనే హైదరాబాద్‌కు రప్పించాలన్న సంకల్పంతో తాము పని చేస్తున్నామని వివరించారు. పరిశోధన, అభివృద్ధి రంగాలకు హైదరాబాద్‌లో అనువైన వాతావరణం ఉందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో నగరాన్ని భాగస్వామిని చేస్తామని స్పష్టం చేశారు. ఏయిరో స్పేస్, డిఫెన్స్, విద్యుత్, బ్యాంకింగ్, డిజిటల్ పేమెం ట్స్, పారిశ్రామిక ఉత్పత్తులకు నగరంలో అనుకూల వాతావరణం నెలకొల్పామన్నారు. కార్యక్రమంలో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, యూఎస్‌ఐబీసీ ఎండీ రాహుల్‌శర్మ, సీనియర్ డైరెక్టర్ ఆదిత్య కౌశిక్ పాల్గొన్నారు.