calender_icon.png 17 November, 2024 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్

10-11-2024 12:00:00 AM

  1. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  2. నవంబర్ 20న టీ -హబ్‌లో కాన్‌క్లేవ్
  3. టీ-హబ్‌లో ద 8 మాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్/శేరిలింగంపల్లి, నవంబర్ 9 (విజయక్రాంతి): ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పరిశ్రమల వృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందించడం కోసమే ద 8 మాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

శనివారం టీ ద 8 మాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లో డిజైన్ విద్యార్థులు, ఇండస్ట్రీ నిపుణులు, మెంటార్లతో సహా 250 మందికి పైగా పాల్గొన్నారు. నవంబర్ 20న ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ ప్రాంగణమైన టీ -హబ్‌లో కాన్‌క్లేవ్ జరగనుంది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించాలన్న ఉద్దేశాన్ని కాన్‌క్లేవ్ పోస్టర్ స్పష్టం చేస్తుందన్నారు. అనంతరం కాన్‌క్లేవ్ అధికార ప్రతినిధి రాజ్ సావంకర్ మాట్లాడుతూ ‘అర్థవంతమైన చర్చలు, సహకారానికి ఈ సదస్సు ఉత్ప్రేరకంగా నిలుస్తుందన్నారు.

వివిధ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలతో కూడిన ప్రదర్శనలను రూపొందించడానికి, నెట్‌వర్కింగ్ అవకాశాలతో తోటివారితో అనుసంధానం కావడానికి ఇదొక మంచి అవకాశమన్నారు. ఫ్యాషన్, జ్యువెలరీ, ఇంటీరియర్స్, సస్టెయినబిలిటీ, గేమింగ్, ప్రొడక్ట్ డిజైన్, ఏఆర్/వీఆర్, హెల్త్ కేర్ సహా పలు రంగాలకు చెందిన నిపుణులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ కాన్‌క్లేవ్ మంచి వేదిక కానుందని తెలిపారు. 

తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో ముందుండాలి 

 తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (ఎంవైటీఏ) దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కౌలాలంపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదేళ్లు పూర్తి చేసుకున్న ఎంవైటీఏకు తెలంగాణ సర్కారు తరఫున దుద్దిళ్ల శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యామని.. రాష్ట్రానికి వెళ్తే అక్కడ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ మన వాళ్లున్నా వాళ్ల కష్టసుఖాల్లో తాము పాలు పంచుకుంటామని తెలిపారు. ఎక్కడ ఉన్నా తెలంగాణ వాసులందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.