calender_icon.png 16 October, 2024 | 2:14 PM

జీసీసీల కేంద్రంగా హైదరాబాద్

16-10-2024 03:37:59 AM

  1. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  2. ఎస్‌ఈఐ కంపెనీ ప్రతినిధులతో సమావేశం
  3. హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై చర్చలు

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో ఎస్‌ఈఐ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎస్‌ఈఐ జీసీసీ ఏర్పాటుపై చర్చించారు. ప్రతిపాదిత జీసీసీతో రాబోయే మూడేళ్లలో ఫైనాన్షియల్ ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని, దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీస్, ఇన్స్యూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఎదగాలన్న రాష్ట్ర లక్ష్యాన్ని తోడ్పాటు లభిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లోని జీసీసీలను ఆకర్షించడంలో ఫైనాన్సియల్ రంగంలోని నైపుణ్యం గల వనరులు కీలకంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్, గోల్డ్‌మెన్ సచ్స్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ కార్యాకలాపాలు ప్రారంభించాయని తెలిపారు.

తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేసేందుకు ఎస్‌ఈఐ ఆసక్తి చూపుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్‌ఈఐ ప్రతినిధులు స్పందిస్తూ ప్రపంచంలోని జీసీసీలకు హైదరాబాద్ ఆకర్షణీయ నగరమని కితాబిచ్చారు. సమావేశంలో ఎస్‌ఈఐ గ్లోబ ల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాచారి ఓమ్యాక్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ డేవిడ్ లాంగ్డేల్, ప్రతినిధులు దీపక్ భరద్వాజ్, మీనాక్షీ మీల్ తదితరులు పాల్గొన్నారు.