calender_icon.png 2 October, 2024 | 12:05 PM

లైఫ్ సైన్సెస్‌లో హైదరాబాద్ కీలకం

02-10-2024 03:00:45 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

  1. నగరానికి స్వీడిష్ లైఫ్ సైన్సెస్ బృందం
  2. సచివాలయంలో మంత్రితో భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అంతర్జాతీయ వాల్యూ చైన్‌లో కీలక స్థానం పొందే అవకాశం ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.

స్వీడిష్ లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన సీఈవో ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తిని వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

జీనోమ్ వ్యాలీ విస్తరణ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపన, నూతన పరిశోధనల రంగాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ఆసక్తిని వారికి వివరించారు. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనే సమున్నత లక్ష్యంతో పరిశ్రమకు తగిన అనుకూల వాతావరణాన్ని సృష్టించామని తెలిపారు.

ఇది ఆధునిక పరిశోధన, తయారీ, నెక్ట్స్ జనరేషన్ ఆరోగ్య సేవలకు మార్గం సుగమమం చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించాలని, పరస్పర అభివృద్ధి, ఇన్నోవేషన్ కోసం ప్రభుత్వంతో సహకరించాలని స్వీడిష్ ప్రతినిధులను ఆహ్వానించగా, ఆసక్తి వ్యక్తం చేశారు.

లైఫ్ సెన్సెస్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలను ప్రశంసించారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, ప్రభుత్వ సానుకూల విధానాల నేపథ్యంలో రాష్ట్రం లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా ప్రపంచ ఆసక్తిని తన వైపు తిప్పుకుంటోందని అభిప్రాయపడ్డారు. 

స్వయం సహాయక బృందాలను 75 లక్షలకు పెంచాలి 

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వయం సహాయక బృందాల మహిళల కోసం ఏర్పాటు చేయనున్న మినీ పారిశ్రామిక పార్కులకు స్థలాల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒక్కో పార్కుకు 2 నుంచి 3 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని సూచించారు.

రెండంతస్థుల భవనాలు నిర్మించి 30 నుంచి 50 స్వయం సహాయక బృందాలకు ప్లగ్ అండ్ ప్లే రీతిలో వసతులు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 64 లక్షల స్వయం సహాయక బృందాల సంఖ్యను 75 లక్షలకు పెంచేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం తేలికేనని, వారి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లడం సవాల్‌తో కూడుకున్న అంశమని చెప్పారు. దీని కోసం పరిశ్రమల శాఖ ఒక సప్లయ్ చైన్ కన్సల్టెంట్‌ను నియమించాలని ఆదేశించారు. ప్రతి మహిళ కోటీశ్వరురాలిగా ఎదగాలన్నదే సీఎం ఆకాంక్ష అని వెల్లడించారు. వారిలో సగం మందిని కోటీశ్వరురాళ్లను చేయగలిగినా గొప్ప లక్ష్యాన్ని సాధించినట్టేనని తెలిపారు.

పొదుపు సంఘాల మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సమావేశంలో సెర్ప్ సీఈవో దివ్య, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, పరిశ్రమల డైరెక్టర్ మల్సూర్, ఎలీప్ వ్యవస్థాపకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 

బయోఏషియా 22వ ఎడిషన్ లోగో 

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించిననున్న బయో ఏషియా సదస్సు లోగోను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైటెక్స్‌లో ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు.

లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిణామాలను పునర్నిర్వచించే విధానాలపై చర్యలు జరుగుతాయని తెలిపారు. గ్లోబల్ హెల్త్ కేర్ రంగంలో నూతన ఆవిష్కరణల ద్వారా తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు.

బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, మెడికల్ డివైజెస్, అడ్వాన్స్‌డ్ థెరప్యూటిక్స్ వంటి టెక్నాలజీస్‌లపై అర్థవంతమైన చర్యలు జరుగుతాయని, కృత్రిమ మేథా, డేటా అనలిటిక్స్, ప్రెసిషన్ మెడిసిన్ వంటి ఆధునిక పరిజ్ఞానాల ద్వారా వస్తున్న అవకాశాలను రాష్ట్రం ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చో నిపుణులు సూచిస్తారని ఆయన వివరించారు. కార్యక్రమంలో బయోసైన్సెన్, ఫార్మా డైరెక్టర్ శక్తినాగప్పన్, ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.