calender_icon.png 31 January, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ అంటేనే బిజినెస్‌కు బ్రాండ్

29-01-2025 01:16:38 AM

మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

దావోస్ పర్యటనలో గతేడాది కంటే నాలుగు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలు, యువతకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ప్రతిపక్షా లు ఎన్ని విమర్శలు చేసినా వాటిని సద్విమర్శలుగానే స్వీకరించామన్నా రు.

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, నమ్మకంతోనే పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తాయన్నారు. గత ఏడాది రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు  సాధించామన్నారు.  సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని, రూ. 450 కోట్లతో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు క్యాపిటలాండ్ ముందుకొచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

స్వట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్, మల్టీవాక్ గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామని, దీంతో వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగు పడిందని తెలిపారు. హైదరాబాద్ అంటేనే బిజినెస్ అనే బ్రాండ్ ఏర్పడిందని, సాంకేతిక నైపుణ్యలకు కేంద్రంగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. తెలంగాణ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలో ఇది మొదటి అడుగు అని తెలిపారు.

అయితే ఒప్పందాలు జరిగినంత మాత్రాన విజయం సాధించినట్లు కాదని, ఎంవోయూలు చేసుకున్న కంపెనీలన్ని స్థాపించినప్పుడే మాకు అతిపెద్ద విజయమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. యువత ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీ విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

స్కిల్ యూనివర్సిటీలో ముందుగా టీచర్స్‌కు శిక్షణ ఇప్పిస్తామన్నారు. రాష్టంలో 51 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మూసీ పునరుజ్జీం, యువతకు ఉపాధిపై దృష్టి పెట్టామన్నారు. మూసీ ప్రక్షాళన చేసి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తామన్నారు. సింగపూర్‌లోనూ మూసీనది లాంటి చిన్న నదిని కూడా ఎంతో సుందరీకరించారని చెప్పారు.

గత ఏడాదిలో 18 కంపెనీలతో ఒప్పందం జరిగిందని, వాటిలో 17 కంపెనీలు పనులు జరుగుతున్నాయన్నారు. 10 కంపెనీల పనులను దాదాపు 60 నుంచి 70 శాతం వరకు పూర్తి కావచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. బీఆర్‌ఎస్ హయాంంలో 2018 నుంచి 2023 వరకు జరిగిన ఒప్పందాల్లో ఎన్ని  పరిశ్రమలు ముందుకొచ్చాయని మీడియా ప్రశ్నించగా..

తమ హయాంలో జరిగిన ఒప్పందాలు, గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై 2028 సంవత్సరంలో నివేదిక ఇస్తామని మంత్రి సమాధానమిచ్చారు. 2022-23 లో రూ. 20 వేల కోట్ల ఒప్పందాలు జరిగితే.. ఆ తర్వాత 2023-24 మా ప్రభుత్వం వచ్చాక రూ. 40 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మన్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ,  వీర్లపల్లి శంకర్, టీజీఐఐడీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.