చలాది పూర్ణచంద్రరావు :
‘లేక్ సిటీ’గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు ఆక్రమణదా రుల గుండెల్లో ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్’ (హైడ్రా) ఫోబియా ఆవరించిం ది. జంటనగరాలకు తాగునీరు, చుట్టుపక్కల సాగునీరు అందించేందుకు, భూగర్భ జలమట్టాలు నిలకడ గా ఉండేందుకు తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబులు గొలుసుకట్టు చెరువులు కట్టారు. ఒకటి నిండితే మరొక దానిలోకి నీరు వెళ్లేలా నాలాలు నిర్మించారు. తాగునీరు, సాగునీరు కొరత లేకుం డా చూడటం, పర్యావర ణ సమతుల్యత కాపాడేందుకు ఆ రోజుల్లోనే చెరువులు నిర్మించిన వారి ముందు చూపునకు జోహార్లు చెప్పక తప్పదు.
స్వాతంత్య్రానంతరం తొలి ఏళ్లలో మినహా తరువాత రాజకీయాల్లో స్వార్థం ప్రవేశించటం, ఒకవైపు భాగ్యనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందటంతో పలుకుబడి కలిగిన అన్ని పార్టీల నాయకులు, మరి కొందరు రియల్టర్లు డబ్బు వెదజల్లి జంటనగరాలకు అందం, జీవ వైవిధ్యం కలిగించే చెరువుల్లో ‘ఫుల్ ట్యాంక్ లెవెల్’ (ఎఫ్‌టీఎల్), ‘బఫర్ లెవెల్’లనూ నిర్భయంగా ఆక్రమించి ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, కన్వెన్షన్ హాల్స్ నిర్మించి భారీగా సొమ్ము చేసుకున్నారు.
అది చాలదన్నట్లు గొలుసుకట్టు చెరువులకు నీటిని తీసుకెళ్లే నాలాలూ మూసేయడం లేదా సామర్థ్యం లేని విధంగా వాటిని దారి మళ్లించి వాటిపైనా అక్రమ కట్టడాలు నిర్మించడం ఇష్టానుసారం చేశారు. ఫలితంగా పెరిగిన నగర విస్తీర్ణం, లక్షల్లో వాహనాలు, త్రీవ ఆక్రమణలతో తగ్గిన చెరువుల విస్తీర్ణతలు.. వెరసి ఏ మాత్రం చిన్న వర్షం కురిసినా నగరంలోని రోడ్లు జలమయం కావటం, గంటలు గంటలు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగర ప్రజలకు ట్రాఫిక్ ఫోభియా ఏర్పడింది.
పుట్టుపూర్వోత్తరాలు
ఎన్నికల ముందు కబుర్లు మెత్తగా చెప్పటం, విజయం సాధించాక అందివచ్చిన అవకాశంతో వారు, వారి బంధు వులు లేదా కాసులకు కక్కుర్తితో ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. నగర ప్రజల ట్రాఫిక్ బాధలు తగ్గకపోగా పెరుగుతూనే వున్నాయి. వరద నీరు తగ్గక, నాలా లు మూసి వెయ్యటంతో గొలుసుకట్టు చెరువుల్లోకి వర్షం నీరు వెళ్లక, ఉన్న చెరువులు ఆక్రమణలతో విస్తీర్ణం తగ్గి నీరు పొంగి రోడ్లపై ప్రవహించి పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వెళ్లటం పరిపాటిగా మారిం ది. హైదరాబాద్‌లో 185కి పైగా చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా చెరువులు పర్యాటక ప్రాంతాలుగా, జీవ వైవిధ్య చెరువులు గా రూపుదిద్దుకున్నాయి.
ఈ చెరువులలో పెద్దదైన హుస్సేన్‌సాగర్ 30 ఏళ్ల కిందట 550 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండగా, ప్రస్తు తం అక్రమణలు పోగా 349 హెక్టార్లకు కుదించుకు పోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌ను హజ్రత్ హుస్సేన్ షా వలి 1562లో మూసీనదికి అనుబంధంగా నిర్మించాడు. ఈ తటాకం ఎప్పుడూ నీటితో నిండి ఉండటంతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలను కలుపుతూ ట్యాంక్‌బండ్ ఉంటుంది. 1992లో ఏకశిలతో రూపొందిన బుద్ధుని విగ్రహం హుస్సేన్‌సాగర్ మధ్యలోని మెరకమీద ప్రతిష్ఠితమైంది. ఉస్మాన్‌సాగర్ లేక దుర్గం చెరువు జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతాల మధ్యలో ఉంటుంది.
ఇది మహమ్మద్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యంలో గోల్కొండ కోటలో, సమీపంలో ఉన్న ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించేందుకు నిర్మితమైంది. రైతులు వ్యవసాయానికి కూడా ఈ చెరువు నీటిని ఉపయోగించేవారు. మరొక ప్రముఖ చెరువు ఉస్మాన్‌సాగర్. ఈ గండిపేట చెరువు 1920లో నిర్మితమవగా, అప్పట్నించీ హైదరాబాద్, చుట్టుపక్కల గ్రామా లకు తాగునీటి అవసరాలను తీరుస్తున్నది.
మూసీనదికి 1908లో వచ్చిన వరదలవల్ల హైదరాబాద్‌కు జరిగిన నష్టాన్ని గుర్తించి ఆ నదిపై ఈ చెరువును నిర్మించారు. ఆఖరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ జమానాలో ఈ చెరువు నిర్మితమైనందువల్ల అయన పేరుమీద ‘ఉస్మాన్ సాగర్ లేక్’గా పిలుస్తు న్నారు. ఈ చెరువు చుట్టుకొలత 46 చ.కి.మీ. కాగా, జలాశయం 29 చ.కి.మీ. వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 3.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉంది. మొదటి పది ప్రధాన చెరువుల్లో హిమాయత్‌సాగర్ ఒకటి.
చెరువు చెరువుకో చరిత్ర
మూసీనదికి ఉపనది అయిన ఈసీపై 1927లో దీని నిర్మాణం పూర్తయింది. ఈ రిజర్వాయర్‌ను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకోసం, అలాగే, వరదల బారినుండి రక్షించడానికి నిర్మించారు. హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఈ చెరువును నిర్మించాడు. అలీఖాన్ కుమారుడు హిమాయత్ అలీఖాన్ పేరుమీద ఈ జలాశయానికి హిమాయత్ సాగర్ అని పేరు పెట్టారు. మరొక ప్రధానమైంది సఫీల్‌గూడ చెరువు. దీన్ని నడిమి చెరువుగా పిలుస్తారు. ఇది ఓల్డ్ నేరేడ్‌మెట్‌లో ఉంది. చిన్న ఐల్యాండ్ ఉండడంతో దీన్ని ‘నడిమి పక్షి ఐల్యాండ్’గానూ వ్యవహరిస్తారు. ఈ చిన్న దీవిని దట్టమైన వృక్షాలు కప్పి ఉంటాయి. ఈ చెట్లమీద రకరకాల పక్షులు సేద తీరుతుంటాయి.
ప్రత్యేకంగా వలస పక్షులు ఇక్కడ అలరిస్తుంటాయి. ఇక, అల్వాల్ చెరువు సికింద్రా బాద్‌కు 6 కి.మీ. దూరంలో పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. సికింద్రాబాద్-- ముంబై రైల్వేట్రాక్ దగ్గరలో ఇది ఉంది. ఈ చెరువు పక్కన రహదారి కూడా ఉంది. ఇది వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నది. దీని సమీపంలో చాలా పక్షులు, జంతువులు నివసిస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో ఆక్రమణలు పెరిగి చెరువులు కన్పించకుండా పోవటంతో సందర్శ కుల సంఖ్య పెద్ద ఎత్తున పడి పోయింది.
ఈ చెరువులతోపాటు మీర్ ఆలం చెరువు హైదరాబాద్‌ను పరిపాలించిన 3వ నిజాం సికిందర్‌జా వద్ద దివానుగా చేసిన మీర్ ఆలం బహదూర్ పేరుమీద నిర్మితమైంది. దీనిని రాజేంద్రనగర్ సమీపంలో అర్ధచంద్రాకారంలో నిర్మించారు. మైలార్‌దేవ్‌పల్లి, హసన్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు ఇందులోకి చేరేది. ఈ చెరువును ఆనుకుని ప్రసిద్ధ నెహ్రూ జూలాజికల్ పార్కును నెలకొల్పారు. జూపార్కు లోని జంతువులకు ఈ చెరువు నీటినే వినియోగిస్తారు.
చెరువు ఒడ్డున కొంత పూడ్చి జీహెచ్‌ఎంసీ మీర్ ఆలం పార్కును నిర్మించింది. దక్కన్ శైలిలో నిర్మితమైన ఈ పార్కులో గోడలపై కుతుబ్‌షాహీ శైలిలో త్రీడీ చిత్రాలు ఉన్నాయి. చెరువును కొంత పూడ్చినందున ఈ పార్కును హైడ్రా ఆపరేషన్‌లో తొలగించాల్సి ఉంది. ఇవికాక రామంతాపూర్, శామీర్‌పేట, సరూర్‌నగర్, అమీన్‌పూర్, జీడిమెట్ల, ఐడీపీఎల్, బంజారా చెరువులతోపాటు మొత్తం 185 చెరువుల్లో ప్రతి దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అయితే, వీటిలో కొన్ని చెరువులను ‘ఒకప్పుడు ఉండేవట’ అని చెప్పుకునే రీతిలో ఆక్రమించుకోవడం దురదృష్టకరం.
పూర్వ వైభవం వచ్చేనా?
‘హైడ్రా’ అంటే తేలికగా జయింపలేనిది. నిజమే. ఏళ్ల తరబడి అక్రమణల కబంధాలలో చిక్కుకుని రాజకీయుల అందండల తో అల్లుకున్న ఆక్రమణలు తొలగించటం నిజంగా అలవికాని పనే. అయినా, ఈ పరిరక్షణ సంస్థకు ‘హైడ్రా’ పేరు అతికినట్లుం ది. నిజాయితీపరుడు, నిఖార్సయిన కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలోని 74 బృం దాలు చెరువుల ఆక్రమిత కట్టడాల తొలగింపు పనుల్లో మునిగి పోయాయి. పైగా, తాజాగా హైడ్రాకు ప్రభుత్వం అపరిమితమైన అధికారాలు ఇచ్చింది కూడా. దీంతో గతంలో ఇలాంటి అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన జీహెచ్‌ఎంసీ, ఇతర సంస్థల అధికార్లను గుర్తించి, వారిపైనా చర్యలు మొదలయ్యాయి.
మరోవైపు వర ద ముంపు తప్పుతుందని పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకుం టే, అత్యంత ధైర్య సాహసాలతో, చెరువులకు పూర్వవైభవం తేవాలని, నగరంలో వరదనీరు లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసి చేపట్టిన చెరు వులు, నాలాల అక్రమణ తొలగింపు కార్యక్రమంలో ఏ కొందరు ఆక్రమణదారులను వదిలేసినా, మినహాయించినా ఆయనకు అంతులేని అవినీతి రంగు పులిమేందుకు సొంత పార్టీ వారితోసహా అన్ని పార్టీలూ సిద్ధంగా ఉన్నాయని చెప్పక తప్పదు.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
సెల్: 9491545699