calender_icon.png 7 November, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి కోసమే ‘హైదరాబాద్ 4.0’ ప్రణాళిక

03-08-2024 05:23:23 AM

క్రెడాయ్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): భవిష్యత్ తరాలు, రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం ‘హైదరాబాద్ 4.0’ ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి క్రెడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రీ ఇమాజినింగ్ హైదరాబాద్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథి విచ్చేసి మాట్లాడారు. రాజధాని సహా తెలంగాణ సమగ్రాభివృద్ధిని నిర్దేశించేలా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. మరో పాతికేళ్లలో ఆ లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాగరి కంచెలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామన్నారు.

బ్యాగరి కంచె పేరు పలికేందుకే కొందరు ఇబ్బంది పడొచ్చని, కానీ మున్ముందు ఆ ప్రాంతం మరో బంజారాహిల్స్‌గా మారుతుందని జోస్యం చెప్పారు. ఒకప్పుడు బంజారాహిల్స్ కూడా అటవీప్రాంతమేనని గుర్తుచేశారు. పాలకులుగా ఎవరున్నా నగరాభివృద్ధి కోసం పనిచేయడంతోనే నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని కొనియాడారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పూర్తయితే కలుషిత జలాలు లేని మూసీని చూస్తామన్నారు. తద్వారా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

నగరానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్నారు. బిల్డర్లు రాజకీయ నాయకులుగా మారితే తాను వారిని ప్రత్యర్థులుగానే చూడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.