- సీసీ కెమెరాల పర్యవేక్షణలో భాగ్యనగరం
- డ్రాగన్ నగరాల తర్వాత మనమే టాప్
- సగటున ప్రతి వెయ్యి మందికి 83 సీసీలు
- జాబితా విడుదల చేసిన ‘కంపారిటెక్’
హైదరాబాద్, నవంబర్ 15 (విజయ క్రాంతి) : ప్రపంచవ్యాప్తంగా నేర పూరిత ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నేరాల కట్టడికి సరైన మానవ వనరులు ఉన్నప్పటికీ సాంకేతిక వినియోగమూ కీలకంగా మారింది. సాంకేతి కతతో నేరాల కట్టడి సులభతరమవుతున్నది. కాగా నిఘా, భద్రత, పర్యవేక్షణలో సీసీ కెమెరాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
పలు కేసుల్లో నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి వినియోగం ఉన్న ప్రాంతాల్లో నేరాలు సైతం అదుపులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సీసీ కెమెరాలను వినియోగిస్తున్న నగరాల జాబితాను కంపారిటెక్ సంస్థ విడుదల చేసింది. హైదరాబాద్ నగరం అద్భుత పనితీరు కనబరుస్తుందని నివేదికలో వెల్లడించింది.
చైనాలోని పలు నగరాలు మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా సీసీ కెమెరాలను అత్యధికంగా వినియోగిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రభాగాన ఉన్నట్టు పేర్కొంది. చైనాలోని చాలా నగరాల్లో ప్రతి వెయ్యిమందికి సగటున 439 సీసీలు వినియోగంలో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో ప్రతి వెయ్యిమందికి 83 సీసీలను వినియోగిస్తున్నారు.
జాబితాలో ఆరు నగరాలు మనవే..
భారతదేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. కాగా మరో ఆరు నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్ తర్వాత ఇండోర్, ఢిల్లీ నగరాలు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలువగా, చెన్నై నగరం 16వ స్థానంలో, పుణె 19, కొచ్చి 21వ స్థానంలో నిలిచాయి.
ప్రతి వెయ్యి మందికి ఇండోర్ నగరంలో 60 సీసీలు, ఢిల్లీలో 20, చెన్నైలో 8, పుణె, కొచ్చి నగరాల్లో 7 సీసీల చొప్పున వినియోగిస్తున్నారు. నేరాల నియంత్రణ, ఇతరత్రా పర్యవేక్షణల కోసం సీసీల వినియోగంలో హైదరాబాద్ నగరం ప్రపంచంతోనే పోటీ పడుతోంది. ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటూనే సీసీల వినియోగంపై ప్రజలకు తెలంగాణ పోలీసులు అవగాహన కల్పిస్తుండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
నేరాల దర్యాప్తులో కీలకం..
నేర పరిశోధన, నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యం పెరుగుతున్నది. గతంలో దొంగతనాల దర్యాప్తునకు ఇబ్బందులు ఎదురవగా.. ప్రస్తుతం పల్లెల్లోనూ సీసీ కెమెరాల వినియోగం పెరగడంతో చోరీల సంఖ్య తగ్గింది. సీసీల వల్ల నేరాలకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంలోనూ సీసీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
2024 ఏడాది మొదటి అర్ధ భాగంలో మొత్తం 49లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదవగా.. వాటిలో 75 శాతం కేసులు సీసీలతో గుర్తించినవే. అంటే 49లక్షల కేసుల్లో 36.77 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలను సీసీ కెమెరాలే గుర్తించాయి. ముఖ్యంగా మానవ రహిత నిఘా, భద్రత పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.