calender_icon.png 6 November, 2024 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు బాగా లేదు

06-11-2024 01:30:17 AM

  1. నాణ్యమైన భోజనం పెట్టకుంటే శిక్షిస్తాం 
  2. స్టార్ హోటల్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు తనిఖీలు 
  3. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు  
  4. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఒకప్పటి బిర్యానీలా ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ టేస్ట్‌గా ఉండటం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం పెట్టనివారిని కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనల మేరకు కఠినంగా శిక్షిస్తామని  మంత్రి రాజనర్సింహ హెచ్చరించారు.

రాష్ర్టంలో ప్రతి హోటల్, రెస్టారెంట్, స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్, హాస్టల్స్, హాస్పిటల్స్, ఆఫీసులలో ఉండే క్యాంటీన్లను ఫుడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఫుడ్ సేఫ్టీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దన్నారు.

ఫుడ్ సేఫ్టీ నియమాలను పాటించే వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్ట్రీట్ వెండర్స్‌కు సూచించారు. ఫుడ్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫుడ్ సేఫ్టీ అవగాహన, ట్రైనింగ్ సదస్సులలో పాల్గొనాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. 

ఒకప్పటిలా బిర్యానీ ఉండట్లేదు..

‘ఒకప్పుడు హైదరాబాద్‌లో బిర్యానీ తింటే ఆ రుచి వర్ణించలేని విధంగా ఉండేదని... కానీ ఓ సాధారణ భోజన ప్రియునిలా చెబుతున్నా... ఇప్పుడు ఆ టేస్ట్ ఉండట్లేదు. ఇలా అయితే ఎలా... హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా మంచి పేరు ఉంది.. ఆ పేరును నిలబెట్టేలా రాష్ర్టంలో ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలి’ అని మంత్రి రాజనర్సింహ ఆకాంక్షించారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. 

కలెక్టరేట్లలో ఫిర్యాదు కేంద్రాలు...

  ఫుడ్ సేఫ్టీ విభాగం బలోపేతానికి కృషి చేస్తున్నామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. ఇప్పుడు హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచబోతున్నామన్నారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో  కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదికి కనీసం 24 వేల ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెల రోజుల్లో 3,774 హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు నమోదు చేశామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీలో ఉత్తమ రేటింగ్ ఉన్న హోటళ్లకు మంత్రి సర్టిఫికెట్లను అందచేశారు.