calender_icon.png 18 October, 2024 | 6:08 AM

ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్

18-10-2024 12:28:33 AM

  1. డీఆర్‌ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ 
  2. ట్రాఫిక్ విభాగం అధికారులతో సమీక్షలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైడ్రా, ట్రాఫిక్ విభాగం పనిచేస్తాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నగర ప్రజలు రోడ్డుపై సాఫీగా వెళ్లేలా హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగాలు ప్రజల భాగస్వామ్యంతో సంయుక్తంగా పనిచేయనున్నట్టు తెలిపారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌లు సంయుక్తంగా ట్రాఫిక్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లతో ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వ హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణపై డీఆర్‌ఎఫ్ బృందాలకు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. గ్రేటర్‌లో 144 వాటర్ లాగింగ్ పాయింట్లను ప్రాధాన్యత క్రమంలో తొలగించనున్నట్టు చెప్పా రు.

వరద కాల్వలు, పైపులలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, కొత్త లైన్లు వేసి వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, వ్యాపారులకు ముందస్తు సమాచారమిచ్చి స్పెషల్ డ్రైవ్ ద్వారా శాశ్వతంగా తొలగిస్తామన్నారు.

ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్ డక్‌లు, జీహెచ్‌ఎంసీ డస్ట్ బిన్‌లు లేకుండా చేస్తామని, కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను, కొమ్మలను తొలగిస్తామన్నారు. వరద నీటి సమస్య, ట్రాఫిక్ ఇబ్బందులు ఉత్పన్నమైనప్పుడు ప్రాంతాల వారీగా ప్రజలకు సమాచారం తెలియజేసేలా ఏర్పాటు చేస్తామని వివరించారు.