25-03-2025 12:47:31 AM
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ను అభివృద్ధిలో రోల్‌మాడల్‌గా తీ సుకునేలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. గత ప్రభుత్వం తరహాలో తాము హైదరాబాద్‌ను డల్లాస్, లండన్, ఇస్తాంబుల్, టర్కీ చేస్తామని చెప్పబోమని, హైదరాబాద్ మహానగరాన్ని హైదరాబాద్‌గానే అభివృద్ధి చేస్తా మన్నారు.
అసెంబ్లీలో పద్దులపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు వివేకానంద, వివేక్ వెంక టస్వామి, పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు లేవనెత్తిన అంశాలపై శ్రీధర్‌బాబు మాట్లాడారు.. అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా టైర్ త్రీసిటీలకు విస్తరిస్తామన్నారు.
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్ర భుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చర్య లు చేపట్టామన్నారు. వారికోసం 20 నియోజకవర్గాల్లో ఐటీ స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు.
ఐటీలో మొదటి స్థానం కోసం..
ఐటీ రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేలా అహర్నిషలు కృషిచేస్తున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. గతేడాదిలో 70 కొత్త జీసీసీలు (గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు) తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
నాలుగు కొత్త ఎలక్ట్రానిక్స్ పార్కులు...
దక్షిణ హైదరాబాద్ ప్రాంతంలో దేశంలోనే ఒక పెద్ద ఎలక్ట్రానిక్ హబ్‌గా అభివృద్ధి చేసే పనిలో భాగంగా నాలుగు కొత్త ఎలక్ట్రానిక్స్ పార్కులను తెస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు కొత్త ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులను సైతం అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 25 లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసి నిరుద్యోగ యువత ఉన్నారని, వారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికోసం ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు లభించేలా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుచేశామన్నారు. 33 జిల్లాల్లో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
500 ఎంజీడీలు మాత్రమే సరఫరా..
హైదరాబాద్‌కు కావాల్సిన 800 ఎంజీడీల్లో 500 ఎంజీడీలను మాత్రమే సరఫరా చేసేందుకు మాత్రమే నీటి వసతులున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తమ లక్ష్యం వన్ ట్రిలియన్ జీడీపీ కాంట్రిబ్యూషన్‌లో అత్యధికంగా మన రాష్ట్రం నుంచి జనరేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.