calender_icon.png 22 January, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టాలకు కేరాఫ్‌గా హైదరాబాద్

22-01-2025 01:48:08 AM

  • మహానగరంలో  ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ సర్కార్
  • రాజధానివాసుల తరఫున బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని నిలదీస్తారు
  • బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  • హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం 

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ ఏడాదికాలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎంగా కేసీఆర్ సారథ్యంలో హైదరాబాద్ సంతోషానికి చిరునామాగా ఉంటే.. నేడు రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యంతో కష్టాలకు కేరాఫ్‌గా మారిందని ఆవే దన వ్యక్తంచేశారు. 

మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య ఇబ్బందులను, కరెంట్ కోతలు, తాగునీటితోపాటు ఇతర సమస్యలను ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమస్యల పరిష్కారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 

బీఆర్‌ఎస్ పాలన హైదరాబాద్ నగరానికి  స్వర్ణయుగం అన్న కేటీఆర్, మెట్రో రైలు, సివరేజీ ప్రాజెక్టులు, ఐటీ వృద్ధి, ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు నగర రూపురేఖల్ని మార్చి దేశానికే  గర్వకారణంగా తీర్చిదిద్దామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా హైదరాబాద్‌లో అమలుకావడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా నగరంలోని పేదలు ఎదురుచూస్తున్నారన్నారు.

కరోనా సమయంలో కూడా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తిచేసి ఫ్లుఓవర్లు, అండర్ పాస్‌లను హైదరా బాద్ వాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి తాము నిర్మిం చిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా చేతకావడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేర్ చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు.

 సీఎం రేవంత్ రెడ్డి పాలనా సామర్థ్యంపై హైదరాబాద్ ప్రజలకు నమ్మకం లేదన్న కేటీఆర్, ఆయనకు పాలన చేతకాదనే నిజాన్ని హైదరాబాద్ వాసులు పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ వాసుల కష్టాలు తీర్చేందుకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీ యాలన్నారు.

రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజిన్ అయినా హైదరాబాద్ ఇమేజీ కాంగ్రెస్ పాలనలో దారుణంగా దెబ్బతిందని,  ఇది హైదరాబాద్‌కే కాకుండా యావత్ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలని, లేకపోతే బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.