* గ్రేటర్‌లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
* సీఐఐ, హీరో మోటార్ కార్ప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 22(విజయక్రాంతి): పర్యావరణహితంగా హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడమే తమ సర్కారు లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలతో గ్లోబల్ లీడర్‌గా అభివృద్ధి చేయా లన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు.
బుధవారం దావోస్‌లో అర్బన్ మొబిలిటీ అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సీఐఐ, హీరో మోటార్‌కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అం దించేందుకు సహకరించాలని పారిశ్రామికవేత్తలందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు.
పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిదేందుకు మొబిలిటీ కంపెనీలు తరలిరావాలని సీఎం పేర్కొన్నారు. ఈవీలను ప్రోత్సహించేందుకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశామన్నారు. దేశంలో ఈవీ వాహనాలు ఎక్కువ మొత్తం లో అమ్ముడుపోయే రాష్ర్టం తెలంగాణ అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నా రు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు.
తీరప్రాంతం లేని లోటు పూడ్చడానికి డ్రైపోర్టు
రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి డ్రైపోర్టును నిర్మించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ డ్రైపోర్టును వేర్ హౌజ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అంతేకాకుండా డ్రైపోర్టు ను మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మా ర్గాలతో అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగరంలో 1.2 కోట్లకు పైగా జనాభా ఉందని, దాదాపు 100 కిలోమీటర్లకుపైగా కొత్తగా మెట్రో లైన్లను నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ 160 కి.మీ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, ఓఆర్‌ఆర్ వెలుపల 360 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు.
ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సతత హరితంగా మార్చే ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం’లో భాగమవుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలంగాణ పెవిలీయన్‌ను సందర్శించి, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబును కలిసి పర్యావ రణ ప్రమాణాన్ని చేయించారు.