- ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ: మంత్రి శ్రీధర్‌బాబు
- హైటెక్ సిటీలో డాటా ఎకానమీ నూతన వర్క్‌స్టేషన్ ప్రారంభం
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాకేతికలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ విస్తరిస్తున్నదని ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సంస్థలు విస్తరించాలని ఆకాంక్షించారు.
ఏఐ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా డెలివరీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘డాటా ఎకానమీ’ నూతన వర్క్ స్టేషన్‌ను ఆదివారం హైటెక్ సిటీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొత్త సంస్థలు నగరం వైపు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్వి న్స్, డాటా బదిలీ రంగాల్లో ‘డాటా ఎకానమీ’ సాధించిన గణనీయ పురోగతిని అభినందించారు. సంస్థ విస్తరణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ నైపుణ్యం ఉన్న మానవ వనరులను ఇండస్ట్రీ రంగానికి అందిస్తుందని వివరించారు.
తమ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఏఐ సిటీ అభివృద్ధిలో ‘డాటా ఎకానమీ’ భాగస్వామి కావాలని కోరారు. వచ్చే ఏడాది చివరినాటికి హైదరాబాద్‌లో మరో 500 మంది కొత్త ఉద్యోగులను నియమిస్తామని ‘డాటా ఎకానమీ’ ప్రతినిధులు మంత్రికి చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి కోపురి, జవహర్, రోషన్‌కుమార్ పాల్గొన్నారు.