calender_icon.png 27 November, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యూచర్ హబ్‌గా హైదరాబాద్

27-11-2024 01:11:46 AM

  1. నగర అభివృద్ధికి 2050 మాస్టర్ విజన్ 
  2. తొలి ఏడాదిలోనే భారీ ప్రాజెక్టులు రాక
  3. లక్ష కోట్లకుపైగా పనులకు ప్రభుత్వం శ్రీకారం
  4. గ్రేటర్ సిటీపై సీఎం ఫోకస్

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాం తి) : ఫ్యూచర్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తొలి ఏడాదిలోనే ప్రజాప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి వినూత్న పంథాను అనుసరించింది. పెరుగుతున్న జనా భాకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్‌తో గ్రేటర్ సిటీ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించింది.

‘ గ్రేట్ ప్లాన్‌తో.. గ్రేటర్ విజన్ ’ తో సిటీలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటేడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణపై సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే రేవంత్‌రెడ్డి దృష్టిసారించారు. సికింద్రాబాద్‌లోని జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు  రూ.2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.

హైదరాబాద్ నాగ్‌పూర్ జాతీయ రహదారిపై రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివే టెడ్ కారిడార్ నిర్మాణానికి భూమిపూజ చేశా రు. ఈ కారిడార్ల నిర్మాణంతోపాటు మెహిదీపట్నం స్కువాక్ నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రక్షణ భూములను రాష్ర్ట ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు సీఎం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. గడిచిన పదేండ్లలో పెండింగ్‌లో ఉన్న ఈ భూముల స్వాధీన ప్రక్రియను కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే సాధించగలిగింది. 

ప్రతిష్ఠాత్మకంగా మూసీ పునరుద్ధరణ 

నగరంలోని జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ను పునరుద్ధరిం చేలా ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. మూసీ నదిలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు 39 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తోంది. ఎల్లంపల్లి నుంచి మరో 20 టీఎంసీల గోదావరి నీళ్లను హైదరాబాద్‌లో తాగునీటికి, మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహానికి వీలుగా బహుళ ప్రయోజనాలుండే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.

బాపూఘాట్ సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను నెలకొల్పనుంది. మీర్‌అలం చెరువు సమీపంలో రూ.360 కోట్ల వ్యయంతో నాలుగు -లేన్ల వంతెన నిర్మాణం చేపడుతోంది. ఎల్బీనగర్ సమీపంలో బైరామాల్ గూడ ఫ్లుఓవర్‌ను ప్రారంభించింది. ఆరాంఘఢ్ నుంచి జూపార్క్ వరకు ఫ్లుఓవర్‌ను త్వరలోనే ప్రారంభించనుంది.  

రహదారుల నిర్మాణానికి రూ. 8,996 కోట్లు 

హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌సీఐటీఐ) ప్రాజెక్ట్ లో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.8,996 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసింది. రూ.596.2 కోట్ల అంచనాలతో వరద నీటి కాలువల నిర్మాణం చేపట్టింది. వాన పడితే నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.

నీళ్లు నిల్వ చేరే ప్రధాన జంక్షన్లన్నింటా వాటర్ ఇన్ టేక్ వెల్స్ తవ్వించి.. అక్కడి నుంచి నీటిని డ్రైనేజీలకు , నాలాలకు తరలించే ప్రాజెక్టును చేపట్టారు.  కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా రూ.826 కోట్ల అంచనాలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవలే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్, రోడ్ నెంబర్- 45 జంక్షన్, ఫిలిమ్‌నగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనుంది.. 

మెట్రో రెండోదశకు ఆమోదం 

రూ.24,237 కోట్లతో మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 69 కిలోమీటర్లకు అదనంగా ఫేజ్ 2లో పాతబస్తీ చుట్టేలా ఎయిర్‌పోర్టు వరకు 76.4 కిలోమీటర్ల విస్తరణ చేపట్టనుంది. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్ నుంచి కోకాపేట్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట , మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు రెండో దశలో విస్తరిస్తారు. హైకోర్టు నూతన భవనానికి బుద్వేల్‌లో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వీటితోపాటు ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనాన్ని గోషా మహల్ సమీపంలో నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించింది. 

చెరువులు, కుంటలు, నాలాల రక్షణకు హైడ్రా ఏర్పాటు 

హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. పోలీస్, ట్రాఫిక్, హెచ్‌ఎండీఏ, జీహెఎంసీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో మురికి నీటి కూపంగా మారిన మూసీ నది పునరుజ్జీవంపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

18 వేల కోట్లతో ట్రిపులార్.. 30 వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ 

హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం) నిర్మాణాన్ని రాష్ర్ట ప్రభుత్వం చేపడుతోంది. సంగారెడ్డి నుంచి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా మహబూబ్‌నగర్‌లోని ఆమనగల్లు, కందుకూరు, ఇబ్రహీంపట్నం నుంచి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వరకు దాదాపు 189 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మిస్తారు.

రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం సన్నద్ధమైంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పనుంది. ఫార్మా సిటీతోపాటు ఏఐ సిటీ, సాఫ్ట్‌వేర్, లైఫ్‌సెన్సైస్, హెల్త్ కేర్ టెక్నాలజీ పరిశ్రమల పవర్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దుతోంది.