- ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్ వృద్ధి వేగంలో భాగ్యనగరానిదే అగ్రస్థానం
- నైట్ ఫ్రాంక్ రిపోర్ట్
న్యూఢిల్లీ, నవంబర్ 19: రియల్ ఎస్టేట్, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ తదితర ప్రమాణాల్లో వేగంగా వృద్ధిచెందుతున్న దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు రియల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
తాజా నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ రిపోర్ట్‌లో వివిధ వృద్ధి ప్రమాణాల్లో ఆరు ప్రధాన నగరాల పనితీరును విశ్లేషించింది. బలమైన మౌలికాభివృద్ధి, పెరుగుతున్న శ్రీమంతుల జనాభాతో రియల్ ఎస్టేట్ డిమాండ్ జోరు, సానుకూల విధాన చర్యలతో సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదల తదితరాలతో హైదరాబాద్ వేగంగా వృద్ధిచెందుతున్న నగరంగా నిలిచిందని నైట్ ఫ్రాంక్ వివరించింది.
దేశంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న నగరాల్లో బెంగళూరు ద్వితీయస్థానాన్ని ఆక్రమిస్తున్నదని, నిపుణుల లభ్యత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించే క్రియాశీలక వ్యవస్థ బెంగళూరు ప్రత్యేకతగా పేర్కొంది.
ముంబై ఎంఎంఆర్ అన్ని ప్రమాణాల్లోనూ స్థిరంగా వృద్ధిచెందుతూ భారత్‌కు ఆర్థిక రాజధానిగా తన స్థానాన్ని నిలుపుకుంటున్నదని, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్‌లు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉత్తమంగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ నివేదిక వివరించింది.
రియల్ ఎస్టేట్ వృద్ధిలో టాప్
రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్ టాప్ ర్యాంక్‌లో ఉన్నదని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. సామాజిక, ఆర్థిక ప్రమాణా ల్లో బెంగళూరు, భౌతిక మౌలిక సదుపాయా లు, పాలనా సామర్థ్యంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ల ర్యాంకింగ్ ఉన్నతంగా ఉన్నదని పేర్కొంది.